David Warner: వార్నర్ విధ్వంసక సెంచరీ... కోహ్లీ సరసన ఆసీస్ స్టార్!

David Warner Equals Virat Kohli Record With Century in T20s
  • బీబీఎల్‌లో డేవిడ్ వార్నర్ భారీ శ‌త‌కం
  • 65 బంతుల్లోనే అజేయంగా 130 పరుగులు బాదిన వైనం
  • టీ20ల్లో 9వ శతకంతో విరాట్ కోహ్లీ రికార్డు సమం
ఆస్ట్రేలియా మాజీ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరోసారి తన విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగాడు. బిగ్ బాష్ లీగ్ (BBL)లో భాగంగా హోబర్ట్ హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిడ్నీ థండర్ తరఫున ఆడుతూ అద్భుత శతకం సాధించాడు. ఈ సెంచరీతో టీ20 ఫార్మాట్‌లో అత్యధిక శతకాలు చేసిన ఆటగాళ్ల జాబితాలో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సరసన చేరాడు. అయితే, వార్నర్ అద్భుత పోరాటం వృథా అయింది. హోబర్ట్ హరికేన్స్ చేతిలో సిడ్నీ థండర్ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

నిన్న‌ జరిగిన ఈ మ్యాచ్‌లో వార్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 65 బంతుల్లోనే 11 ఫోర్లు, 9 భారీ సిక్సర్లతో 130 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ బీబీఎల్‌ సీజన్‌లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. ఈ శతకంతో టీ20 క్రికెట్‌లో వార్నర్ సెంచరీల సంఖ్య 9కి చేరింది. ఫలితంగా 9 శ‌త‌కాలు చేసిన విరాట్ కోహ్లీ సరసన నిలిచాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్ (22), బాబర్ అజామ్ (11) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్ జట్టు, ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో కెప్టెన్ వార్నర్ జట్టును ఆదుకున్నాడు. శామ్ బిల్లింగ్స్, నిక్ మ్యాడిన్సన్‌తో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. దీంతో సిడ్నీ జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరు సాధించింది.

అనంతరం 206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హోబర్ట్ హరికేన్స్ జట్టుకు ఓపెనర్లు టిమ్ వార్డ్, మిచ్ ఓవెన్ అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు 108 పరుగులు జోడించి విజయానికి బలమైన పునాది వేశారు. ఆ తర్వాత నిఖిల్ చౌదరి, మాథ్యూ వేడ్ రాణించడంతో హోబర్ట్ జట్టు మరో ఓవర్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి విజయం అందుకుంది.
David Warner
Warner century
Virat Kohli
BBL
Big Bash League
Sydney Thunder
Hobart Hurricanes
T20 cricket
cricket records
Tim Ward

More Telugu News