Deepinder Goyal: అవన్నీ తప్పుడు వార్తలే.. డ్రామాలు: ఉద్యోగుల తొలగింపు వార్తలపై జొమాటో బాస్!

Deepinder Goyal Denies Layoff Reports as False Drama
  • 500 మందిని తీసేశారన్న వార్త అబద్ధమన్న దీపిందర్ గోయల్
  • 20 మందిపైనే చర్యలు తీసుకున్నామని వెల్లడి
  • 28 నిమిషాలు ఆలస్యంగా వస్తే తీసేస్తారా? అన్న ప్రశ్నకు దీపిందర్ స్ట్రాంగ్ కౌంటర్
  •  రెడిట్, ఇతర వేదికలపై జరుగుతున్న ప్రచారాన్ని పట్టించుకోనన్న గోయల్
కార్పొరేట్ ప్రపంచంలో జొమాటో సీఈవో దీపిందర్ గోయల్‌ది ఒక ప్రత్యేక శైలి. అయితే, ఇటీవలి కాలంలో ఆయనపై ‘అమానవీయ’ బాస్ అనే ముద్ర వేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. తాజాగా రాజ్ షామానీ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న గోయల్, తనపై వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. ఏప్రిల్ 2025లో సుమారు 500-600 మంది కస్టమర్ సపోర్ట్ ఉద్యోగులను అకస్మాత్తుగా తొలగించారన్న వార్తపై రాజ్ షామానీ ప్రశ్నించగా.. దీపిందర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. "ఆ వార్త పూర్తిగా తప్పు" అని కొట్టిపారేశారు. పనితీరు రివ్యూల ఆధారంగా, నెలల తరబడి ఫీడ్‌బ్యాక్ ఇచ్చిన తర్వాత కేవలం 20 మందిని మాత్రమే తొలగించామని స్పష్టం చేశారు. ఎవరో రెడిట్‌లో పోస్ట్ చేసిన ‘డ్రామా’ను అందరూ నమ్మారని, దానిపై వివరణ ఇచ్చి ప్రాముఖ్యం కల్పించకూడదనే తాము మిన్నకుండిపోయామని చెప్పారు.

ఒక ఉద్యోగి కేవలం 28 నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకు తీసేశారన్న వార్తపై కూడా దీపిందర్ ఘాటుగా స్పందించారు. "కస్టమర్ కేర్ అనేది క్లాక్-టు-క్లాక్ జాబ్. అక్కడ కెపాసిటీ ప్లానింగ్ ఉంటుంది. ఒక వ్యక్తి 28 నిమిషాలు ఆలస్యం అయితే, ఆ సమయంలో కస్టమర్లకు సాయం చేసే వారు ఉండరు. అందరూ ఇలాగే చేస్తే సంస్థ ఎలా నడుస్తుంది?" అని ప్రశ్నించారు. సదరు వ్యక్తికి ముందే హెచ్చరికలు జారీ చేశామని, పద్ధతి మార్చుకోనందునే చర్యలు తీసుకున్నామని వివరించారు.

ఒకవైపు పాడ్‌కాస్ట్‌లో దీపిందర్ తన వాదన వినిపిస్తుండగా, మరోవైపు దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల నుంచి జొమాటో తీవ్ర నిరసనలు ఎదుర్కొంటోంది. తక్కువ వేతనాలు, సామాజిక భద్రత లేకపోవడంపై డిసెంబర్ 25, 31 తేదీల్లో డెలివరీ బాయ్స్ భారీ సమ్మె చేపట్టారు. ఈ ఉద్రిక్తతల మధ్య దీపిందర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కార్పొరేట్, సోషల్ మీడియా సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
Deepinder Goyal
Zomato
employee layoffs
customer support
gig workers strike
performance reviews
Raj Shamani
corporate news
India
social media

More Telugu News