Shashi Tharoor: ఇళ్ల కూల్చివేతలు.. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సమర్థించిన శశిథరూర్

Shashi Tharoor Defends Congress Government on Bangalore House Demolitions
  • బెంగళూరులో ఇళ్ల కూల్చివేత డ్రైవ్‌ను సమర్థించిన శశిథరూర్
  • కూల్చివేతలకు గురైన ఇళ్లు ప్రభుత్వ భూముల్లో నిర్మించారన్న ఎంపీ
  • కూల్చివేతలకు సంబంధించి ముందుగానే నోటీసులు ఇచ్చినట్లు వెల్లడి
బెంగళూరులో కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల కూల్చివేతలపై కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ స్పందించారు. ఉత్తర బెంగళూరులోని కోగిలు ప్రాంతంలోని వసీ లేఅవుట్, ఫకీర్ కాలనీలలో ప్రభుత్వం ఇళ్ల కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కూల్చివేతలను శశిథరూర్ సమర్థించారు. ఇవి చట్టపరమైన విధానాలకు లోబడే జరుగుతున్నాయని, నిర్వాసితులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేస్తుందని ఆయన వెల్లడించారు.

కూల్చివేతకు గురైన ఇళ్లు ప్రభుత్వ భూముల్లో నిర్మించారని ఆయన తెలిపారు. అక్కడ నివసిస్తున్న ప్రజలు చట్టవిరుద్ధంగా ఉంటున్నారని ఆయన స్పష్టం చేశారు. ఆ భూములు ప్రభుత్వానికి చెందినవని, అంతేకాకుండా అది వ్యర్థాలను పారవేసే ప్రాంతమని, అక్కడ అక్రమంగా ఇళ్లు నిర్మించారని ఆయన పేర్కొన్నారు. విషపూరిత వ్యర్థాలు అక్కడి జలాలను కలుషితం చేయడం వల్ల అది ఎంత మాత్రం సురక్షితం కాదని అన్నారు. నివసించడానికి ఆ ప్రాంతం ఏమాత్రం అనుకూలం కాదని థరూర్ తెలిపారు.

కూల్చివేతలకు సంబంధించి అక్కడు నివసిస్తున్న వారికి ముందుగానే నోటీసులు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు. నిర్వాసితులకు ప్రత్యామ్నాయ గృహాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కూల్చివేతల వల్ల పేద ప్రజలకు అన్యాయం జరుగుతోందనే ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశాన్ని పేదరికం కోణంలో చూడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇది పూర్తిగా భూ యాజమాన్య హక్కులు, ప్రజల భద్రతకు సంబంధించిన అంశమని ఆయన నొక్కి చెప్పారు.
Shashi Tharoor
Bangalore demolitions
Karnataka government
house demolitions

More Telugu News