Tilak Varma: విజయ్ హజారే ట్రోఫీలో చెలరేగిన తిలక్ వర్మ
- రాజ్‌కోట్ వేదికగా చండీగఢ్‌తో హైదరాబాద్ మ్యాచ్
- 109 పరుగులు చేసిన తిలక్ వర్మ
- అభిరత్ రెడ్డితో కలిసి 114 పరుగుల భాగస్వామ్యం
విజయ్ హజారే ట్రోఫీ 2025–26 సీజన్‌ను హైదరాబాద్ కెప్టెన్, టీమిండియా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ అద్భుతంగా ఆరంభించాడు. టోర్నీలో తాను ఆడిన తొలి మ్యాచ్‌లోనే శతకం సాధించి తన క్లాస్ ఏంటో మరోసారి నిరూపించాడు. రాజ్‌కోట్ వేదికగా చండీగఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో తిలక్ సూపర్ సెంచరీతో హైదరాబాద్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టుకు ఆరంభం మాత్రం తీవ్ర నిరాశ కలిగించింది. ఓపెనర్లు అమన్ రావ్ (13), తన్మయ్ అగర్వాల్ (16) స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్‌కు చేరడంతో స్కోరు బోర్డు ఒత్తిడిలో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ తిలక్ వర్మ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు.
ఆరంభంలో చాలా ఓపికగా ఆడిన తిలక్, క్రీజులో కుదురుకున్న తర్వాత బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. సరైన బంతులను ఎంచుకుంటూ బౌండరీలు సాధించడమే కాకుండా, అవసరమైనప్పుడు భారీ షాట్లతో స్కోరు వేగాన్ని పెంచాడు. అభిరత్ రెడ్డి (71)తో కలిసి కీలకమైన 114 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి హైదరాబాద్ ఇన్నింగ్స్‌కు పునాది వేశాడు.
మొత్తంగా 118 బంతులు ఎదుర్కొన్న తిలక్ వర్మ 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 109 పరుగులు చేసి ఔటయ్యాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఫలితంగా హైదరాబాద్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. చండీగఢ్ బౌలర్లలో జగజీత్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా, రోహిత్ దండా, హర్ తేజస్వి కపూర్, విశూ కశ్యప్ తలా రెండు వికెట్లు సాధించారు.
ఇదిలా ఉండగా, న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో తిలక్ వర్మకు జట్టులో చోటు దక్కుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో తిలక్ జట్టులో ఉన్నప్పటికీ, ఈసారి కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తిరిగి జట్టులోకి రానుండటంతో తిలక్‌పై వేటు పడే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది.
మరోవైపు కర్ణాటక ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్ కూడా వరుసగా సెంచరీలతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అతడితో పాటు వికెట్ కీపర్ విషయంలోనూ మార్పులు జరిగే అవకాశముందని తెలుస్తోంది. రిషబ్ పంత్ స్థానంలో ఇషాన్ కిషన్‌కు అవకాశం ఇవ్వవచ్చన్న ప్రచారం సాగుతోంది. మొత్తానికి తిలక్ వర్మ విజయ్ హజారే ట్రోఫీలో చేసిన ఈ శతకం, అతడి జాతీయ జట్టు అవకాశాలపై మరింత ఆసక్తిని పెంచిందనే చెప్పాలి.