kethireddy venkatarami reddy: ఆపరేషన్ సిందూర్, చంద్రబాబుపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కీలక వ్యాఖ్యలు

 Former YSRCP MLA Kethireddy Venkataram Reddy key comments on Operation Sindoor and Chandrababu
  • ఎవరికీ తెలియకుండానే ఆపరేషన్ సిందూర్ ఆగిపోయిందన్న కేతిరెడ్డి
  • ట్రంప్ ట్వీట్ చేసే వరకు యుద్ధం కొనసాగుతోందనే భావన ప్రజల్లో ఉందని వ్యాఖ్య
  • కేసులు కొట్టేయించుకునే పనిలో చంద్రబాబు ఉన్నారని విమర్శ

ఆపరేషన్ సిందూర్ అంశంపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరికీ తెలియకుండానే ఆపరేషన్ సిందూర్ ఆగిపోయిందని ఆయన ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్విట్టర్‌లో ట్వీట్ చేసే వరకు యుద్ధం కొనసాగుతోందనే భావన ప్రజల్లో ఉందని అన్నారు.


ఇక ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ‘ఆపరేషన్ సిందూర్ 2.0’ అంటూ పోస్టులు పెట్టడం ఆశ్చర్యం కలిగించిందని కేతిరెడ్డి వ్యాఖ్యానించారు. అసలు ఆపరేషన్ ఎందుకు ఆగిందో, దానికి కారణాలేంటో ప్రజలకు ఇప్పటికీ స్పష్టత లేదన్నారు. అలాగే ఢిల్లీ పేలుడు కేసు విషయంలోనూ ఇప్పటివరకు ఏం జరిగిందో ఎవరికీ తెలియని పరిస్థితి ఉందని విమర్శించారు.


దేశ ఆర్థిక పరిస్థితులపై కూడా కేతిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రోజురోజుకీ రూపాయి విలువ పడిపోతోందన్నారు. ఇలాంటి పరిస్థితి మరో ఐదేళ్లు కొనసాగితే దేశ పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని హెచ్చరించారు. అయినా మనం ఏమీ పట్టించుకోకుండా మౌనంగా ఉండటం వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని వ్యాఖ్యానించారు.


ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై మాట్లాడిన కేతిరెడ్డి... సీఎం చంద్రబాబు తనపై నమోదైన కేసులను కొట్టివేయించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వ్యవస్థలను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారని విమర్శలు చేశారు. ఇకపై పార్టీ విషయాలపై మాత్రమే కాకుండా, సమాజంలో జరుగుతున్న పరిణామాలు, సామాజిక పరిస్థితులపై తరచుగా వీడియోల ద్వారా మాట్లాడతానని కేతిరెడ్డి స్పష్టం చేశారు.

kethireddy venkatarami reddy
Former YSRCP MLA
YSRCP
Chandrababu
Chief Minister
Andhra Pradesh

More Telugu News