కొనసాగుతున్న మరో ఎన్ కౌంటర్... 12 మంది మావోయిస్టుల మృతి

  • దక్షిణ బస్తర్ జిల్లా అడవుల్లో కాల్పుల మోత
  • ఉదయం 5.30 గంటలకు ప్రారంభమైన కాల్పులు
  • కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి మావోయిస్టులపై భద్రతా బలగాలు విరుచుకుపడుతున్నాయి. బీజాపూర్ జిల్లా దక్షిణ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఉదయం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య తీవ్రస్థాయిలో కాల్పులు చోటుచేసుకున్నాయి.


 దక్షిణ బస్తర్ ప్రాంతంలో మావోయిస్టుల సంచారం ఉందన్న సమాచారం అందడంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ) బృందాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి. ఈ క్రమంలో ఉదయం సుమారు 5.30 గంటల సమయంలో అటవీ ప్రాంతంలో దాగి ఉన్న మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భద్రతా బలగాలు కూడా వెంటనే ప్రతిస్పందించడంతో రెండు వైపులా ఎదురుకాల్పులు జరిగాయి.


కాల్పులు ముగిసిన తర్వాత ఆ ప్రాంతాన్ని పూర్తిగా జల్లెడ పట్టిన భద్రతా బలగాలకు 12 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఘటనా స్థలిలో 3 ఏకే-47 రైఫిళ్లతో పాటు, పలు ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే, ఆ ప్రాంతంలో ఇంకా మావోయిస్టులు ఉండే అవకాశముందని భావిస్తున్న భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి.


జవాన్ల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఎన్‌కౌంటర్ జరిగిన కచ్చితమైన ప్రదేశాన్ని అధికారులు ప్రస్తుతం బయటకు వెల్లడించలేదు. పూర్తి వివరాలు గాలింపు చర్యలు ముగిసిన తర్వాత వెల్లడించే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. 



More Telugu News