Revanth Reddy: ఎంజీ నరేగాను కొనసాగించాలంటూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం

Revanth Reddy demands continuation of MGNREGA in Telangana Assembly resolution
  • నరేగాను యథాతధంగా కొనసాగించాలన్న సీఎం రేవంత్ రెడ్డి 
  • సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన మంత్రి సీతక్క
  • కొత్త చట్టానికి తెలంగాణ వ్యతిరేకమని తెలియజేయాలనే ఈ తీర్మానం చేశామన్న సీఎం 
ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు గ్రామీణ పేదల జీవితాలను మళ్లీ అస్తవ్యస్తం చేసే ప్రమాదం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మార్పుల వల్ల గ్రామాల్లో పని దొరకక పేదలు మళ్లీ పట్టణాలకు వలస బాట పట్టాల్సిన దుస్థితి ఏర్పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

నిరుపేద గ్రామీణ కుటుంబాలకు ఉపాధి కల్పించాలన్న సదుద్దేశంతో ఆనాటి యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని సీఎం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధి హామీకి ప్రత్యామ్నాయంగా కేంద్రం తీసుకొచ్చిన ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్–గ్రామీణ (వీబీ–జీరామ్‌జీ)’ను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.

ఈ మేరకు రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని శుక్రవారం సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. జాతీయ ఉపాధి హామీ పథకంలో నుంచి గాంధీ పేరును తొలగించడంతో పాటు పలు కీలక మార్పులు చేస్తూ కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం తిరస్కరిస్తోందని స్పష్టం చేస్తూ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ఉపాధి హామీ చట్టంపై, దానిలోని సాధకబాధకాలపై ఈ సభలో విస్తృతంగా చర్చ జరిగింది.

తీర్మానంపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ…కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టానికి తెలంగాణ రాష్ట్రం వ్యతిరేకమని స్పష్టంగా తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఈ తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి పేద కూలీకి సంవత్సరానికి వంద రోజుల ఉపాధి కల్పించడమే ఈ పథక ప్రధాన లక్ష్యమని తెలిపారు. గత 20 ఏళ్లుగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన వారిలో 90 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారని వెల్లడించారు.
Revanth Reddy
MGNREGA
Telangana
Employment Guarantee Scheme
Vikshit Bharat Guarantee
Rural Employment
Sitakka
Telangana Assembly
Rural Poverty
UPA Government

More Telugu News