భయపెడుతున్న మధుమేహం.. దేశంలో తగ్గుతున్న చక్కెర వినియోగం!

  • 2025-26లో 28.5 మిలియన్ టన్నులకు పరిమితమయ్యే అవకాశం
  • మధుమేహం, గుండె జబ్బుల భయం, పెరిగిన ఆరోగ్య స్పృహే కారణం
  • చక్కెరకు బదులుగా స్టెవియా, బెల్లం, ఖర్జూరం వంటి ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు
భారతీయుల ఆహారపు అలవాట్లలో కీలక మార్పు చోటుచేసుకుంటోంది. ఒకప్పుడు ఏటా 4 శాతానికి పైగా పెరిగే చక్కెర వినియోగం ఇప్పుడు గణనీయంగా మందగించిందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. 2024-25లో 28.1 మిలియన్ టన్నులుగా ఉన్న వినియోగం, 2025-26 ఆర్థిక సంవత్సరంలో స్వల్పంగా పెరిగి 28.5 మిలియన్ టన్నులకు చేరుకోవచ్చని ఇండియన్ షుగర్ అండ్ బయో-ఎనర్జీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐఎస్ఎంఏ) అంచనా వేసింది. 2023-24లో నమోదైన 29 మిలియన్ టన్నుల వినియోగం కంటే ఇది తక్కువ కావడం గమనార్హం.

దేశంలో ప్రస్తుతం 10 కోట్ల మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు, మరో 13.6 కోట్ల మంది ప్రీ-డయాబెటిక్ దశలో ఉండటం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. టైప్-2 డయాబెటిస్, గుండె జబ్బులు, ఊబకాయం వంటి ముప్పుల నుంచి తప్పించుకోవడానికి యువత చక్కెర వినియోగాన్ని తగ్గిస్తున్నారు. సాదా చక్కెరకు బదులుగా స్టెవియా వంటి కృత్రిమ తీపి పదార్థాలతో పాటు సహజసిద్ధమైన బెల్లం, ఖర్జూరం, పండ్ల నుంచి వచ్చే చక్కెరను ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు. అయితే, కృత్రిమ తీపి పదార్థాలను అతిగా వాడటం వల్ల క్యాన్సర్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరోవైపు, దేశంలో చక్కెర ఉత్పత్తి మాత్రం గణనీయంగా పెరగనుంది. అనుకూల వర్షపాతం కారణంగా 2025-26 సీజన్‌లో ఉత్పత్తి 30.95 మిలియన్ టన్నులకు చేరుతుందని అంచనా. ఒకవైపు వినియోగం తగ్గుతుండటం, మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెజిల్ చక్కెర ధరలతో పోటీ పడలేక ఎగుమతులు మందగించడం పరిశ్రమను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో, అదనపు నిల్వలను సమతుల్యం చేయడానికి ఇథనాల్ ఉత్పత్తిపై పాత విధానాలను పునరుద్ధరించాలని చక్కెర మిల్లుల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.


More Telugu News