Mexico Earthquake: మెక్సికోలో భూకంపం

Mexico Earthquake Strikes Guerrero State
  • రిక్టర్ స్కేల్‌పై 6.3 గా నమోదైనట్లు పేర్కొన్న జీఎఫ్‌జెడ్
  • దక్షిణ మెక్సికోలోని గెరెరో రాష్ట్రంలో భూ ప్రకంపనలు 
  • రాజధాని సిటీలో ఎలాంటి నష్టం జరగలేదన్న మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్
మెక్సికోలో నిన్న ఉదయం భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైనట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (జీఎఫ్‌జడ్) తెలిపింది. దక్షిణ మెక్సికోలోని గెరెరో రాష్ట్రంలో ఈ భూకంపం సంభవించగా, భూకంప కేంద్రం భూమికి సుమారు 10 కిలోమీటర్ల (6.21 మైళ్లు) లోతులో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

పసిఫిక్ తీరప్రాంతంలోని ప్రముఖ రిసార్ట్ నగరం అకాపుల్కో సమీపంలో ఉన్న గెరెరో రాష్ట్రంలోని శాన్ మార్కోస్ పట్టణం వద్ద భూకంప కేంద్రం ఉన్నట్లు జీఎఫ్‌జడ్ పేర్కొంది. తీవ్ర ప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొన్ని ప్రాంతాల్లో భారీ భవనాలు కుదుపునకు లోనయ్యాయి.

భూకంపం నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభావిత ప్రాంతాల్లో స్థానిక యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. నష్టం వివరాలను అంచనా వేసేందుకు అధికారులు రంగంలోకి దిగారు.

ఈ ఘటనపై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ స్పందించారు. గెరెరో రాష్ట్ర గవర్నర్‌తో మాట్లాడినట్లు ఆమె 'ఎక్స్' వేదికగా తెలిపారు. రాజధాని మెక్సికో సిటీలో ఎలాంటి నష్టం జరగలేదని ఆమె పేర్కొన్నారు.

కాగా, నిన్న ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్న సమయంలోనే భూ ప్రకంపనలు సంభవించాయి. అయినప్పటికీ ఆమె ఏమాత్రం ఆందోళన చెందకుండా ప్రశాంతంగా వ్యవహరిస్తూ, మీడియా ప్రతినిధులను సురక్షిత ప్రదేశానికి తరలించారు. 
Mexico Earthquake
Mexico
Earthquake
Guerrero
Claudia Sheinbaum
German Research Centre for Geosciences
GFZ
Acapulco
San Marcos
Mexico City

More Telugu News