మలయాళ సినిమాలు వేరే లెవల్... క్రికెటర్ దినేశ్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • మలయాళ చిత్ర పరిశ్రమపై ప్రశంసలు కురిపించిన క్రికెటర్ దినేశ్ కార్తీక్
  • ఇటీవల తాను చూసిన 'పొన్మన్', 'ఎకో' సినిమాలు అద్భుతంగా ఉన్నాయని వెల్లడి
  • 'పొన్మన్'లో నటుడు బాసిల్ జోసెఫ్ నటన అమోఘమని ప్రశంస
భారత మాజీ క్రికెటర్, వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ మలయాళ చిత్ర పరిశ్రమపై ప్రశంసల వర్షం కురిపించాడు. మంచి సినిమాలను చూసినప్పుడు సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకునే డీకే, ఇటీవల తాను చూసిన రెండు మలయాళ చిత్రాలను ఆకాశానికెత్తాడు. మలయాళ సినిమా వేరే లెవల్లో ఉందని కొనియాడాడు.

ఈ మేరకు తన 'ఎక్స్' ఖాతాలో దినేశ్ కార్తీక్ ఒక పోస్ట్ చేశాడు. "గత వారంలో 'పొన్మన్', 'ఎకో' అనే రెండు అద్భుతమైన చిత్రాలు చూశాను. 'పొన్మన్'లో నటుడు బాసిల్ జోసెఫ్ నటన అమోఘం. సినిమా మొత్తం అతడి పాత్రతోనే మనం ప్రయాణిస్తాం. అందులో ఇతర నటులు కూడా అద్భుతంగా చేశారు" అని పేర్కొన్నాడు.

అనంతరం 'ఎకో' చిత్రం గురించి స్పందిస్తూ... "ఈ సినిమా సినిమాటోగ్రఫీ, లొకేషన్లు, ప్రత్యేకమైన కథ నన్ను ఆశ్చర్యపరిచాయి. దర్శకుడు దిన్జిత్ దీన్ని అద్భుతంగా తీశారు. మలయాళ సినిమా స్థాయి నిజంగా వేరు. ఇలాంటి మరిన్ని చిత్రాలు రావాలి" అని కార్తీక్ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు.

జోతిష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'పొన్మన్' చిత్రంలో బాసిల్ జోసెఫ్, సజిన్ గోపు, లిజోమోల్ జోస్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకొని, 50 రోజుల పాటు విజయవంతంగా ప్రదర్శితమైంది. గతంలో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూడా బాసిల్ జోసెఫ్ నటనను మెచ్చుకున్నారు. ఇక 'ఎకో' చిత్రం దిన్జిత్ అయ్యతాన్ దర్శకత్వంలో వచ్చిన ఒక థ్రిల్లర్ మూవీ. దీనికి కూడా మంచి ప్రశంసలు దక్కాయి


More Telugu News