'గ్రోక్‌'తో మహిళల మార్ఫింగ్ ఫొటోలు.. కేంద్రమంత్రికి ఎంపీ ప్రియాంక చతుర్వేది ఫిర్యాదు

  • మహిళ ఫొటోను అశ్లీలంగా మార్చాలని ప్రాంప్ట్ ఇస్తే సమాధానం ఇస్తున్న 'గ్రోక్'
  • మహిళల గోప్యతకు సంబంధించిన ఈ అంశంపై కేంద్రం జోక్యం చేసుకోవాలన్న శివసేన ఎంపీ
  • కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు లేఖ రాసిన ప్రియాంక చతుర్వేది
ఒక సాధారణ మహిళ ఫోటోను అశ్లీలంగా మార్చమని ప్రాంప్ట్ ఇస్తే, దానికి ఏఐ చాట్‌బాట్ 'గ్రోక్' ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా సమాధానం ఇస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాలంలో మహిళల మార్ఫింగ్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ అంశంపై శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల గోప్యతకు సంబంధించిన ఈ అంశంపై తక్షణమే కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ ఆమె కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు లేఖ రాశారు.

ఎలాన్ మస్క్‌కు చెందిన ఏఐ చాట్‌బాట్ 'గ్రోక్' అసభ్య పదజాలంతో, దూషణలతో విరుచుకుపడుతున్నట్లు ఆరంభంలో విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత రాజకీయంగా పక్షపాతం చూపిస్తోందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. తాజాగా మహిళల అశ్లీల ఫొటోలను మార్ఫింగ్ చేయడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

సామాజిక మాధ్యమాల్లో, ముఖ్యంగా 'ఎక్స్'లో నడుస్తున్న అసభ్యకర ట్రెండ్ గురించి మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నానని, ఏఐ గ్రోక్‌ను ఉపయోగించి కొందరు మహిళల చిత్రాలను మార్ఫింగ్ చేస్తున్నారని ఎంపీ ప్రియాంక చతుర్వేది ఆ లేఖలో పేర్కొన్నారు.

ఏఐని దుర్వినియోగం చేస్తున్నారని, గ్రోక్ కూడా ఇలాంటి ప్రాంప్ట్‌లను అందిస్తోందని ఆమె కేంద్ర మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇది మహిళల హక్కులకు, భద్రతకు భంగం కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం అనైతికమే కాదని, నేరం కూడా అని, కాబట్టి ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.


More Telugu News