అన్వేష్ గురించేనా... పరోక్ష వ్యాఖ్యలతో గరికపాటి నరసింహారావు ఫైర్!
- అందరూ ఈసడించుకుంటే అన్వేష్ 10 రోజుల్లో మారతాడన్న అన్వేష్
- తప్పు చేసిన వాడిని ప్రశ్నించే ధైర్యం ఉండాలని వ్యాఖ్య
- ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రెస్పాండ్ కావాలని పిలుపు
యూట్యూబర్ అన్వేష్ వ్యాఖ్యల వ్యవహారం ఇంకా చల్లారకముందే... ప్రముఖ ప్రవచనకర్త, మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు ఈ అంశంపై పరోక్షంగా స్పందించడంతో విషయం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. అన్వేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఇప్పటికే సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఫాలోవర్స్ భారీగా తగ్గడంతో పాటు, విమర్శలు ముదిరిపోవడంతో అన్వేష్ బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో తాజాగా గరికపాటి నరసింహారావుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ప్రవచనంలో ఆయన మాట్లాడిన మాటలను చాలామంది అన్వేష్ వ్యాఖ్యలకే సంబంధించి స్పందనగా భావిస్తున్నారు. అయితే ఆయన ఎక్కడా పేరు ప్రస్తావించకుండా, సమాజంలో పెరుగుతున్న బాధ్యతారాహిత్యపు మాటల సంస్కృతిపై గట్టిగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
“ఒక నేరస్థుడికి శిక్ష పడితే మారతాడో లేదో తెలియదు. కానీ పది మంది కలిసి అతడిని ఈసడించుకుంటే మాత్రం పది రోజుల్లో మారతాడు” అంటూ గరికపాటి వ్యాఖ్యానించారు. సమాజంలో తప్పు చేసిన వారిని ప్రశ్నించే ధైర్యం ఉండాలని, అవసరమైతే ముఖం మీదే తప్పు అని చెప్పగలగాలని స్పష్టం చేశారు. లేకపోతే ఎలాంటి తప్పు చేయని వారిపై కూడా బురద జల్లుతూ, వ్యక్తిత్వ నాశనానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి వ్యాఖ్యలను చాలామంది చూస్తూ కూడా మౌనంగా ఉండిపోతారని, ‘మనకెందుకు’ అనుకుని వదిలేస్తారని గరికపాటి అన్నారు. అయితే తన విషయంలో మాత్రం అభిమానులు ఎప్పుడూ అలా చేయలేదని చెప్పారు. తప్పు అనిపించినప్పుడు వెంటనే స్పందిస్తూ, గట్టిగా నిలబడుతున్నారని చెప్పారు. సోషల్ మీడియాలో కూడా మనదే పైచేయి... అందులో సందేహం లేదు అని వ్యాఖ్యానించారు.