మనం చీరలు కడతాం... లండన్‌లో షార్ట్స్ వేస్తారు: దుస్తులపై నటి రోహిణి

  • పిల్లలు తప్పుదారి పట్టకుండా మంచి మార్గంలో నడిపించాలని తల్లిదండ్రులకు సూచన
  • డ్రగ్స్, ఇతర చెడు అలవాట్లకు బానిసలు కాకుండా చూసుకోవాలన్న రోహిణి
  • మన అలవాట్లను మన పిల్లలకు మనమే చెప్పాలన్న రోహిణి
మన దేశంలో చీరలు కట్టుకోవడం, లండన్‌లో షార్ట్స్, స్కర్ట్స్ వేసుకోవడం ఆయా ప్రాంతాల అలవాట్లని ప్రముఖ సినీ నటి రోహిణి అన్నారు. ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, పిల్లలు తప్పుదారి పట్టకుండా మంచి మార్గంలో నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులపై ఉందని చెప్పారు. పిల్లలు డ్రగ్స్, ఇతర చెడు అలవాట్లకు బానిసలు కాకుండా చూసుకోవాలని హితవు పలికారు.

ప్రస్తుతం సమాజంలో యువత డ్రగ్స్ బారిన పడుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. వాటి నియంత్రణకు పోలీసులు, అధికారులు కృషి చేస్తున్నప్పటికీ, ప్రజలు కూడా తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని అన్నారు. పిల్లలను మంచి దారిలో నడిపించాలని సూచించారు. స్నేహితుల కోసం లేదా ఇతర కారణాల వల్ల చెడు అలవాట్లు చేసుకోవద్దని తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలన్నారు. పిల్లల్లో మార్పులు కనిపిస్తే, వారితో మాట్లాడి అన్ని విషయాలు వివరించాలని సూచించారు.

ఇక్కడ చీరలు కట్టుకోవడం మన అలవాటు అని, విదేశాల్లో స్కర్ట్స్ వేసుకుంటారని, ఎవరి అలవాట్లు వారికి ఉంటాయని రోహిణి తెలిపారు. మన అలవాట్లను మనం పిల్లలకు నేర్పించాలని, ఇదే విషయాన్ని తన కుమారుడికి చెబుతుంటానని ఆమె వెల్లడించారు. చెడు అలవాట్ల వల్ల కలిగే నష్టాలను పిల్లలకు తెలియజేయాలని సూచించారు. క్లిష్ట సమయంలో మనం ఇచ్చే సలహాలు వారికి ఉపయోగపడతాయని అన్నారు.

పిల్లలు విన్నా వినకపోయినా, మనం చెప్పాల్సింది చెప్పాలని సూచించారు. రాబోయే తరాలు బాగుంటేనే భవిష్యత్తు బాగుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. తల్లిదండ్రులు కూతుళ్లకు, కుమారులకు ఏం చేయాలో, ఏం చేయకూడదో చెప్పాలన్నారు. అలాగే, కుటుంబంలో అందరూ కలిసి పనిచేయాలని తల్లి కూతురికి, కొడుకుకు చెప్పాలని సూచించారు. ప్రతి మహిళ చదువుకోవడం ముఖ్యమని, సమాజాన్ని సరిదిద్దే శక్తి స్త్రీకి మాత్రమే ఉందని ఆమె అన్నారు.

మహిళలు పుట్టుకతోనే శ్రామికులని రోహిణి వ్యాఖ్యానించారు. వంట ఎవరైనా చేయగలరని, కాబట్టి అబ్బాయిలకు కూడా అన్ని పనులు నేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. అందరూ చదువుకోవాలని, సమానత్వంతో కూడిన సమాజం రావాలని ఆమె ఆకాంక్షించారు.


More Telugu News