కెరీర్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్న అలియా భట్

  • తల్లి అయిన తర్వాత అలియా జీవితంలో కీలక మార్పు
  • ఇకపై ఒక్కో సినిమాను మాత్రమే చేస్తానన్న అలియా
  • తన జీవితం చాలా సంతోషంగా ఉందన్న టాప్ హీరోయిన్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్‌ ఇప్పుడు తన కెరీర్‌లో మరో కొత్త దశను ఆస్వాదిస్తోంది. వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో టాప్‌లో కొనసాగుతున్న అలియా... తాజాగా తన పని తీరులో కీలక మార్పులు చేసుకుంటోంది. ఇప్పటివరకు ఒకేసారి రెండు మూడు సినిమాలు చేయడమే అలవాటుగా ఉన్న ఆమె, ఇకపై ఆ పద్ధతికి గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది.


ఈ ఏడాది అలియా ‘ఆల్ఫా’, ‘లవ్ అండ్ వార్’ వంటి భారీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సినిమాలతో బిజీగా ఉంటూనే, మరోవైపు తల్లిగా తన బాధ్యతలకు పూర్తి ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌పై అలియా స్పష్టమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అలియా, మాతృత్వం తన జీవితాన్ని ఎలా మార్చిందో ఓపెన్‌గా మాట్లాడింది. “రాహా మా జీవితంలోకి వచ్చిన తర్వాత నా ప్రొఫెషనల్ లైఫ్ పూర్తిగా మారిపోయింది. బిడ్డను చూసుకోవాల్సిన బాధ్యత కారణంగా నా పనిలో సహజంగానే వేగం తగ్గింది. అయినా నేను చాలా సంతృప్తిగా, సంతోషంగా ఉన్నాను” అని అలియా చెప్పింది.


ఇంతకుముందు లాగా ఒకేసారి రెండు మూడు సినిమాలకు సైన్ చేయడం ఇక సాధ్యం కాదని స్పష్టం చేసింది. “ఇప్పుడు ఒకే సినిమా చేస్తున్నాను. కానీ ఆ పాత్రకు వంద శాతం న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. క్వాలిటీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాను” అని అలియా వెల్లడించింది.


తల్లి అయిన తర్వాత యాక్షన్ సన్నివేశాలు చేయడం పెద్ద సవాలేనని కూడా అలియా అంగీకరించింది. ప్రస్తుతం తాను నటిస్తున్న ‘ఆల్ఫా’ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లో పాల్గొంటున్నట్లు చెప్పింది. “బిడ్డ పుట్టిన తర్వాత ఇలాంటి యాక్షన్ సీన్స్ చేయడం నాకు కొత్త అనుభూతిని ఇచ్చింది. నా శరీరం ఎంత శక్తివంతంగా ఉందో నాకు నేనే తెలుసుకున్నాను. నా శరీరంపై గౌరవం మరింత పెరిగింది” అని చెప్పుకొచ్చింది.


మొత్తానికి అలియా భట్ ఇప్పుడు కెరీర్, కుటుంబం రెండింటికీ సమాన ప్రాధాన్యం ఇస్తూ ముందుకెళుతోంది. తల్లిగా మారిన తర్వాత కూడా తనలోని నటిని మరింత బలంగా తీర్చిదిద్దుకుంటూ, సినిమాల్లో కొత్త ఛాలెంజ్‌లకు సిద్ధమవుతున్న అలియా నిర్ణయం అభిమానుల్లో ప్రశంసలు అందుకుంటోంది.



More Telugu News