డాక్టర్ల కన్నా ఏఐ బెటర్.. ఎలాన్ మస్క్ పాత వీడియో వైరల్!

  • వైద్యంలో ఏఐపై మస్క్ చేసిన పాత వ్యాఖ్యలు మళ్లీ వైరల్
  • డాక్టర్ల కన్నా గ్రాక్ ఏఐ మెరుగైనదని గతంలో చెప్పిన మస్క్
  • వెలుగులోకి గ్రాక్ ఏఐతో ప్రాణాలు కాపాడుకున్న వ్యక్తి కథనం 
  • ఏఐ రోగ నిర్ధారణపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు
  • మస్క్ రీట్వీట్‌తో మరోసారి తెరపైకి వచ్చిన టెక్నాలజీ చర్చ
టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ చేసిన పాత వ్యాఖ్యలతో కూడిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ చక్కర్లు కొడుతోంది. వైద్య రంగంలో తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 'గ్రాక్' (Grok) సామర్థ్యాల గురించి మస్క్ మాట్లాడిన ఈ వీడియో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. "డాక్టర్ల కన్నా గ్రాక్ ఏఐ కొన్నిసార్లు మెరుగైన రోగ నిర్ధారణ చేస్తుంది. మీ ఎక్స్-రే లేదా ఎంఆర్‌ఐ ఇమేజ్‌లను గ్రాక్‌కు అప్‌లోడ్ చేస్తే, అది మీకు వైద్యపరమైన సలహా ఇస్తుంది" అని మస్క్ ఆ వీడియోలో చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

వాస్తవానికి మస్క్ ఈ వ్యాఖ్యలు చేసింది 2025 జూన్‌లో. అయితే, ఎక్స్ లో 'టెస్లా ఓనర్స్ సిలికాన్ వ్యాలీ' చేసిన ఒక పోస్ట్‌ను మస్క్ రీట్వీట్ చేయడంతో ఈ వీడియో మళ్లీ వెలుగులోకి వచ్చింది. 2025 చివర్లో నార్వేకు చెందిన 49 ఏళ్ల వ్యక్తి ప్రాణాలను గ్రాక్ ఏఐ ఎలా కాపాడిందీ ఈ పోస్ట్ వివరించింది. తీవ్రమైన కడుపునొప్పితో ఆసుపత్రికి వెళ్లిన ఆ వ్యక్తికి, డాక్టర్లు యాసిడ్ రిఫ్లక్స్ అని చెప్పి మందులు ఇచ్చారు. అయినా నొప్పి తగ్గకపోవడంతో అతను గ్రాక్ ఏఐని సంప్రదించాడు. అది అపెండిసైటిస్ లేదా అల్సర్ అయ్యుండొచ్చని, వెంటనే సీటీ స్కాన్ చేయించుకోవాలని సూచించింది. తిరిగి ఆసుపత్రికి వెళ్లగా, పరీక్షల్లో అపెండిక్స్ పగిలిపోయే దశలో ఉన్నట్లు తేలింది. వెంటనే శస్త్రచికిత్స చేయడంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు.

ఈ ఉదంతం వెలుగులోకి రావడంతో వైద్య రంగంలో ఏఐ పాత్రపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. "మస్క్ చెప్పింది నిజమే. గ్రాక్ ఎంఆర్ఐ ఇమేజ్‌లను చాలా కచ్చితంగా, కొన్ని సెకన్లలోనే విశ్లేషిస్తోంది. రేడియాలజిస్ట్ రిపోర్ట్ కోసం మూడు రోజులు ఆగాల్సి వస్తోంది" అని ఒకరు మద్దతు పలకగా, "నా ఎంఆర్ఐని గ్రాక్ తప్పుగా నిర్ధారించింది" అని మరొకరు విమర్శించారు. "నా బ్రౌజర్ హిస్టరీని అప్‌లోడ్ చేస్తే నా మానసిక పరిస్థితిపై డయాగ్నోసిస్ ఇస్తుందా?" అంటూ ఇంకొకరు చమత్కరించారు.


More Telugu News