మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ... తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయిన కీలక నేత

  • డీజీపీ ఎదుట లొంగిపోయిన మావే నేత బర్సే దేవా
  • హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత మావోలకు భారీ ఎదురుదెబ్బ
  • హిడ్మా, బర్సేలది ఒకే గ్రామం

ఇప్పటికే అనేక సమస్యలను ఎదుర్కొంటున్న మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. గత కొన్ని నెలలుగా ఎదుర్కొంటున్న సమస్యలు, ఎన్‌కౌంటర్లు, నేతల ఆరోగ్య సమస్యలు, అంతర్గత గ్రూపు సమస్యలు ఇప్పటికే పార్టీని బలహీనపరిచాయి. ఈ సంక్షోభంలో మరో కీలక మావోయిస్టు నేత బర్సే దేవా ఈ రోజు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో పోలీసుల ఎదుట లొంగిపోయారు.


బర్సే దేవా మావోయిస్టు గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్‌గా పనిచేస్తూ, పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న నేత. ముఖ్యంగా ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కీలక నేత హిడ్మా మరణించిన తర్వాత, పార్టీకి అవసరమైన ఆయుధాలు, వ్యూహాలు, రక్షణ కార్యకలాపాలన్నింటిని బర్సే దేవా చూసుకుంటున్నారని పోలీసులు తెలిపారు. బర్సే దేవా, హిడ్మా ఒకే గ్రామానికి చెందినవారని, దీంతో మావోయిస్టు పార్టీలో ఆయన పాత్ర మరింత కీలకమని విశ్లేషకులు చెబుతున్నారు.


పోలీసులకి లొంగిన తర్వాత, బర్సే దేవా దగ్గర మౌంటెన్ ఎల్ఎంజీని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆయన పర్యవేక్షించిన మిలిటరీ ఆపరేషనల్ కమాండ్ సభ్యులు కూడా పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ పరిణామంతో, మావోయిస్టు పార్టీకి కీలకంగా నిలిచిన నాయకత్వ వ్యవస్థలో పెద్ద గ్యాప్ ఏర్పడింది.


రేపు బర్సే దేవాను మీడియా ముందు ఉంచి, ఆయన లొంగిపోవడంలో వచ్చే ప్రాముఖ్యత, స్వాధీనం చేసిన ఆయుధాల వివరాలు, మిలిటరీ ఆపరేషనల్ కమాండ్ సభ్యుల గురించి డీజీపీ శివధర్ రెడ్డి అధికారికంగా వివరించనున్నారు. ఈ సంఘటన తెలంగాణలోని మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. గతంలో, అనేక మంది కీలక నేతలు ఎన్‌కౌంటర్‌లో మరణించడం, ఆరోగ్య సమస్యలు, పార్టీ అంతర్గత విభజనలు వంటి కారణాలతో ఇప్పటికే ఎంతోమంది సరెండర్ అయ్యారు. తాజాగా బర్సే దేవా కూడా పోలీసుల ఎదుట లొంగిపోయిన తరువాత, పార్టీ వ్యూహాలపై తీవ్ర ప్రభావం పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. మావోయిస్టు ఉద్యమం ఇప్పటి వరకు చూసుకున్న వ్యూహాలను సరిచూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది.



More Telugu News