దర్శన్ భార్యకు అసభ్యకర మెసేజ్ లు... టెక్కీ సహా ఇద్దరి అరెస్ట్

  • నటుడు దర్శన్ భార్య విజయలక్ష్మి వేధింపుల కేసులో కీలక పరిణామం
  • అసభ్యకర కామెంట్లు పెట్టిన ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • అరెస్టయిన వారిలో దావణగెరెకు చెందిన టెక్కీ, బెంగళూరుకు చెందిన ఆటో డ్రైవర్
  • ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • తన ఫిర్యాదుపై పోలీసులు నిర్లక్ష్యం చేశారని విజయలక్ష్మి ఇటీవల ఆరోపణ
కన్నడ నటుడు దర్శన్ భార్య విజయలక్ష్మికి సోషల్ మీడియాలో అసభ్యకర సందేశాలు పంపిన కేసులో ఇద్దరిని కర్ణాటక పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితులలో ఒకరు సాఫ్ట్‌వేర్ నిపుణుడు (టెక్కీ) కావడం గమనార్హం. దావణగెరెకు చెందిన టెక్కీ నితిన్, బెంగళూరులోని చిక్కబానవర ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ చంద్రుగా వీరిని గుర్తించారు. ఐపీ అడ్రస్‌ల ఆధారంగా పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు.

విజయలక్ష్మిపై నిందితులు సోషల్ మీడియాలో అసభ్యకరమైన భాష వాడుతూ, అశ్లీల కామెంట్లు పోస్ట్ చేశారు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఆ సందేశాలను తొలగించారు. గతవారం విజయలక్ష్మి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి, 15 ఇన్‌స్టాగ్రామ్ ఐడీలు, 150కి పైగా అభ్యంతరకర కామెంట్లకు సంబంధించిన ఆధారాలను సమర్పించారు.

అయితే, తన ఫిర్యాదుపై బెంగళూరు పోలీసులు సరిగ్గా స్పందించడం లేదని, నిర్లక్ష్యం వహిస్తున్నారని విజయలక్ష్మి ఇటీవలే ఆరోపించారు. నటి రమ్య ఫిర్యాదుపై వెంటనే స్పందించిన పోలీసులు, తన విషయంలో మాత్రం జాప్యం చేస్తున్నారని ఆమె సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరి ఒత్తిళ్ల వల్లే ఈ ఆలస్యం జరుగుతోందా అని కూడా ఆమె అనుమానం వ్యక్తం చేశారు.

విజయలక్ష్మి ఆరోపణలను బెంగళూరు పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ ఖండించారు. విచారణ మొదటి నుంచి కొనసాగుతోందని ఆయన స్పష్టం చేశారు. తాజాగా ఇద్దరిని అరెస్ట్ చేయడంతో ఈ కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ప్రస్తుతం ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది.


More Telugu News