కేసీఆర్‌కు దగ్గరగా ఉన్న నేతలను దూరం చేసేలా కవిత మాట్లాడుతున్నారు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

  • కవిత ప్రస్తుతం బీఆర్ఎస్‌లో ఉన్నారా లేదా అనే విషయం వెల్లడించాలన్న మంత్రి
  • కేసీఆర్‌ను విమర్శిస్తే స్పందించిన కవిత, హరీశ్ రావుపై విమర్శలకు స్పందించలేదని వ్యాఖ్య
  • కేసీఆర్ వదిలిన రాజకీయ బాణంగా కవిత ఉన్నారన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
కవిత ప్రస్తుతం కేసీఆర్‌కు సన్నిహితంగా ఉన్న బీఆర్ఎస్ నాయకులందరినీ దూరం చేసే ధోరణిలో మాట్లాడుతున్నారని తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కేసీఆర్ రోజూ అసెంబ్లీకి వస్తే బీఆర్ఎస్ పుంజుకుంటుందన్న కవిత వ్యాఖ్యలు ఆమె రాజకీయ భవిష్యత్తను ప్రశ్నార్థకం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కవిత ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారో లేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కవిత చేసిన వ్యాఖ్యలను మంత్రి తీవ్రంగా ఖండించారు. కేసీఆర్‌పై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు కవిత  వెంటనే స్పందించారని, కానీ హరీశ్ రావుపై చేసిన విమర్శలపై ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని కోమటిరెడ్డి నిలదీశారు. ఇది చూస్తుంటే కవిత కేసీఆర్ వదిలిన రాజకీయ బాణంగా ఉన్నారని ఆరోపించారు. నల్గొండ జిల్లాకు కేసీఆర్ హయాంలో జరిగిన అన్యాయాన్ని కవిత ప్రశ్నించి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసిందని కవిత స్వయంగా అంగీకరించడం హర్షణీయమని మంత్రి అన్నారు. బీఆర్ఎస్ నేతలు దోచుకున్నారని కవిత స్వయంగా ఆరోపిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. 


More Telugu News