Harish Rao: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా ఈ నిర్ణయం: హరీశ్ రావు

Harish Rao Announces Boycott of Assembly Sessions in Protest
  • అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించినట్లు వెల్లడి
  • బీఏసీలో తీసుకున్న నిర్ణయాలకు విరుద్ధంగా సభను నిర్వహిస్తున్నారని విమర్శ
  • ముఖ్యమంత్రిని విమర్శించవద్దని చెప్పడమేమిటని స్పీకర్‌పై ఆగ్రహం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించుకున్నట్లు బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు వెల్లడించారు. అదే సమయంలో స్పీకర్ తీరును వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. శాసనసభ నుంచి వాకౌట్ చేసిన అనంతరం గన్ పార్కు వద్ద పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి హరీశ్ రావు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు విరుద్ధంగా సభను నిర్వహిస్తున్నారని ఆరోపించారు.

సభను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బూతుల మయం చేశారని ఆయన దుయ్యబట్టారు. ఆయన వ్యాఖ్యలపై నిరసన తెలిపేందుకు ప్రధాన ప్రతిపక్షంగా తమకు అవకాశం ఇవ్వాలని సభాపతిని కోరితే, ముఖ్యమంత్రిని విమర్శించవద్దని ఆయన చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. ప్రధానమంత్రిని రాహుల్ గాంధీ విమర్శించడం లేదా? మరి ముఖ్యమంత్రిని విమర్శించవద్దని చెప్పడం ఏం ప్రజాస్వామ్యమని నిలదీశారు.

అసెంబ్లీని గాంధీ భవన్, సీఎల్పీ సమావేశంలా రేవంత్ రెడ్డి మారుస్తున్నారని ఎద్దేవా చేశారు. తాము ప్రశ్నిస్తే అడ్డగోలుగా చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఎదుటి వారి మీద బాడీ షేమింగ్ చేస్తున్నారని, వీధి రౌడీలా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌పై పదేపదే చావు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి అని అన్నారు.

అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులకు మైకు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. అలాంటప్పుడు అక్కడ కూర్చున్నా ఎలాంటి లాభం లేదని వాకౌట్ చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి మీద మాట్లాడితే మైక్ కట్ చేస్తానని స్పీకర్ ఆన్ రికార్డు చెప్పారని పేర్కొన్నారు.
Harish Rao
Revanth Reddy
Telangana Assembly
BRS party
Assembly boycott
Telangana politics

More Telugu News