ఖతార్ జైల్లో భారత మాజీ నేవీ అధికారి.. విడుదల కోసం ప్రధానికి మాజీ అధికారి సోదరి విజ్ఞప్తి

  • ఖతార్ జైల్లో ఉన్న మాజీ నేవీ అధికారి పుర్నేందు తివారీని విడిపించాలని ప్రధానికి ఆయన సోదరి విజ్ఞప్తి
  • గతంలో క్షమాభిక్ష లభించినా, కొత్త కేసులో ఇరికించి ఆరేళ్ల జైలు శిక్ష విధించారని ఆవేదన
  • గూఢచర్యం కేసులో అరెస్టయిన 8 మందిలో ఏడుగురు ఇప్పటికే భారత్‌కు తిరిగి వచ్చిన వైనం
  • విదేశాంగ శాఖ నిర్లక్ష్యం వల్లే తన సోదరుడికి ఈ దుస్థితి పట్టిందని కుటుంబం ఆరోపణ
ఖతార్‌లో గూఢచర్యం ఆరోపణలతో అరెస్టయి, ఆ దేశ పాలకుడి క్షమాభిక్షతో విడుదలైన 8 మంది భారత మాజీ నేవీ అధికారుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏడుగురు అధికారులు భారత్‌కు తిరిగి రాగా, మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన రిటైర్డ్ కమాండర్ పుర్నేందు తివారీ (65) మాత్రం ఓ కొత్త కేసులో చిక్కుకుని దోహా జైల్లోనే మగ్గుతున్నారు. తన సోదరుడిని వెంటనే విడిపించాలని కోరుతూ ఆయన సోదరి డాక్టర్ మీతూ భార్గవ ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌లకు విజ్ఞప్తి చేశారు.

2022 ఆగస్టులో గూఢచర్యం ఆరోపణలపై తివారీ సహా 8 మందిని ఖతార్ అధికారులు అరెస్ట్ చేశారు. మొదట మరణశిక్ష విధించినా, భారత ప్రభుత్వం చేసిన దౌత్య ప్రయత్నాల ఫలితంగా శిక్షను జైలు శిక్షగా మార్చారు. 2024 ఫిబ్రవరిలో ఖతార్ అమీర్ క్షమాభిక్ష ప్రసాదించడంతో ఏడుగురు అధికారులు స్వదేశానికి తిరిగి వచ్చారు. అయితే, తివారీ పనిచేస్తున్న దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ కంపెనీకి సంబంధించిన ఆర్థిక అవకతవకల కేసులో ఆయనపై ట్రావెల్ బ్యాన్ ఉండటంతో ఆయన అక్కడే చిక్కుకుపోయారు.

తాజాగా పాత కేసు ఆధారంగానే కుట్రపూరితంగా మరో కేసును సృష్టించారని, అందులో క్రిమినల్ కుట్ర, మనీ లాండరింగ్ ఆరోపణలతో తన సోదరుడికి ఆరేళ్ల జైలు శిక్ష విధించారని మీతూ భార్గవ 'ఎక్స్‌' వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల రోజులుగా ఆయన జైల్లో తీవ్ర అవమానాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు. భారత విదేశాంగ శాఖ నిర్లక్ష్యం వల్లే తన సోదరుడు ఈ దుస్థితిలో ఉన్నారని ఆమె ఆరోపించారు. సుదీర్ఘకాలం ఏకాంతవాసంలో ఉండటంతో తివారీ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిందని, ఆయన హైపర్‌టెన్షన్, డయాబెటిస్, పీటీఎస్‌డీ వంటి సమస్యలతో బాధపడుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ విషయంలో భారత నేవీ ఉన్నతాధికారులు కూడా మౌనంగా ఉండటంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.


More Telugu News