కేసీఆర్, హరీశ్ రావులపై కవిత సంచలన వ్యాఖ్యలు
- కేసీఆర్ సభకు రాకపోవడం సరికాదన్న కవిత
- ఒక కూతురిగా తన రక్తం ఉడుకుతోందని వ్యాఖ్య
- హరీశ్ పైనా విమర్శలు చేసిన కవిత
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు మీడియాతో మాట్లాడిన కవిత, బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు రాకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. "సభకు కేసీఆర్ రావడం తప్పనిసరి. ఆయన రాకపోతే బీఆర్‌ఎస్ పార్టీకి నష్టం జరుగుతుంది. కేసీఆర్ తప్పు చేయకపోతే సభకు రావాలి. సభకు రాకుండా పిల్ల కాకుల గురించి మాట్లాడుతూ సమయాన్ని వృథా చేసుకోవద్దు. ఒక కూతురిగా నా రక్తం ఉడుకుతోంది" అని కవిత చెప్పారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పక్కన పెట్టిన కేసీఆర్ ను ఉరి తీయాలన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ... కేసీఆర్ ను ఒకసారి ఉరి తీయాలంటే రేవంత్ రెడ్డిని 10 సార్లు ఉరితీయాలని అన్నారు. సొంత జిల్లా మహబూబ్ నగర్ కు రేవంత్ ఎన్ని ప్రాజెక్టులు తెచ్చారని ప్రశ్నించారు.
ఇదే సమయంలో హరీశ్ రావుపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనకు ప్యాకేజీలు తీసుకోవడం తప్ప ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సభకు రాకపోతే అన్నీ హరీశ్ చూసుకోవడం సరికాదని... కేసీఆర్ సభకు రావాలని వ్యాఖ్యానించారు.