కోనసీమ జిల్లా కలెక్టర్ కు తప్పిన ప్రమాదం... వీడియో ఇదిగో!

  • కోనసీమలో బోటు రేస్ ట్రయల్ రన్‌లో అపశ్రుతి
  • అదుపుతప్పి బోల్తాపడ్డ కలెక్టర్ మహేశ్ కుమార్ బోటు
  • గోదావరి నీటిలో పడిపోయిన కలెక్టర్.. రక్షించిన సిబ్బంది
  • లైఫ్ జాకెట్ ధరించడంతో తప్పిన పెను ప్రమాదం
  • సంక్రాంతి డ్రాగన్ బోట్ ఫెస్టివల్ ఏర్పాట్ల పరిశీలనలో ఈ ఘటన
అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్. మహేశ్ కుమార్‌కు శుక్రవారం ఉదయం తృటిలో పెను ప్రమాదం తప్పింది. సంక్రాంతి సంబరాల కోసం నిర్వహిస్తున్న బోటు రేస్ ట్రయల్ రన్‌లో ఆయన ప్రయాణిస్తున్న బోటు అదుపుతప్పి గోదావరిలో బోల్తా పడింది. అయితే, ఆయన లైఫ్ జాకెట్ ధరించి ఉండటంతో సురక్షితంగా బయటపడ్డారు.

వివరాల్లోకి వెళితే.. ఆత్రేయపురం మండలం పులిదిండి వద్ద సంక్రాంతి సందర్భంగా 'సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ డ్రాగన్ బోట్ ఫెస్టివల్' నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్లిన కలెక్టర్ మహేశ్ కుమార్, ట్రయల్ రన్‌లో భాగంగా స్వయంగా ఒక కయాక్‌ను నడిపారు. ఈ క్రమంలో బోటు అదుపుతప్పి బోల్తా కొట్టడంతో ఆయన నీటిలో పడిపోయారు.

వెంటనే అప్రమత్తమైన గజ ఈతగాళ్లు, సహాయక సిబ్బంది మరో బోటులో ఆయన వద్దకు చేరుకుని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. ఈ ఘటనతో అధికారులు, స్థానికులు కాసేపు ఆందోళనకు గురైనప్పటికీ, కలెక్టర్ క్షేమంగా ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

కాగా,  డ్రాగన్ బోట్ ఫెస్టివల్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ మీనా, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కూడా పాల్గొన్నారు. ఈ ఘటన అనంతరం ట్రయల్ రన్‌ను యథావిధిగా కొనసాగించారు. జనవరి 11 నుంచి 13 వరకు ఈ బోటింగ్ పోటీలు జరగనున్నాయి.


More Telugu News