Gali Janardhan Reddy: గాలి జనార్ధన్ రెడ్డిపై కేసు నమోదు

Gali Janardhan Reddy Booked in Violence Case
  • గాలి, ఎమ్మెల్యే భరత్ వర్గాల మధ్య ఘర్షణ
  • గాలితో పాటు 10 మందిపై కేసు నమోదు
  • తనపై కాల్పులు జరిపిన బుల్లెట్ ను మీడియాకు చూపించిన గాలి
కర్ణాటకలోని బళ్లారిలో బ్యానర్లు కట్టే విషయంలో ఎమ్మెల్యే గాలి జనార్ధనరెడ్డి వర్గానికి, కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి వర్గానికి మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో గాలి జనార్ధన్ రెడ్డి, ఆయన సోదరుడు సోమశేఖర్ రెడ్డి, ఆయన సన్నిహితుడు, మాజీ మంత్రి శ్రీరాములు సహా పది మందిపై బ్రూస్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు.  

భరత్ రెడ్డి అనుచరుడు శేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసులు నమోదయ్యాయి. రాళ్లు, కొడవళ్లు, కర్రలు, సోడా బాటిల్స్ తో తమపై దాడి చేశారని భరత్ వర్గం ఆరోపించింది. 

మరోవైపు, ఈ ఘటనలో ఒక వర్గంపై మరో వర్గం దాడికి పాల్పడింది. ఇద్దరి గన్ మెన్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఒక గన్ మెన్ నుంచి తుపాకీని లాక్కున్న సతీశ్ రెడ్డి గాలి జనార్ధన్ రెడ్డిపై కాల్పులకు దిగారు. అయితే, జనార్ధన్ రెడ్డి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఇదే సమయంలో ఇరు వర్గాలు కాల్పులకు దిగాయి. ఈ క్రమంలో భరత్ రెడ్డి వర్గానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మృతి చెందాడు. 

ఈ ఘటనలో సతీశ్ రెడ్డికి బుల్లెట్ గాయమయింది. దీంతో, ఆయనను చికిత్స నమిత్తం బెంగళూరుకు తరలించారు. ప్రస్తుతం బళ్లారిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీగా పోలీసులు మోహరించారు. ఈ ఘటనపై గాలి జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ... తనపై కాల్పులు జరిపిన బుల్లెట్ ను మీడియాకు చూపించారు. వాల్మీకి విగ్రహం ఏర్పాటు పేరుతో భరత్ రెడ్డి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. వారికి భయపడే ప్రసక్తే లేదని అన్నారు.
Gali Janardhan Reddy
Karnataka
Bellary
MLA Bharat Reddy
Violence
Clash
Firing
Police Case
Somasekhara Reddy
Sriramulu

More Telugu News