పర్సనల్ ట్రైనర్‌గా చాట్‌జీపీటీ.. 27 కిలోలు తగ్గి ఆశ్చర్యపరిచిన యువకుడు!

  • చాట్‌జీపీటీని పర్సనల్ ట్రైనర్‌గా వాడుకొని 27 కేజీలు తగ్గిన యువకుడు
  • జిమ్, ఖరీదైన డైట్ లేకుండానే ఈ ఫలితం సాధించినట్లు తెలిపిన హసన్
  • తాను వాడిన 7 కీలకమైన ప్రాంప్ట్‌లను సోషల్ మీడియాలో షేర్ చేసిన వైనం
  • క్రమశిక్షణతో ఏఐని సరిగ్గా వాడితే లక్ష్యాలు సులభమన్న హసన్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వాడకం రోజువారీ జీవితంలో వేగంగా విస్తరిస్తోంది. ప్రయాణాల ప్లానింగ్ నుంచి ఆఫీస్ పనుల వరకు సాయం చేస్తున్న ఏఐ, ఇప్పుడు బరువు తగ్గడం లాంటి వ్యక్తిగత లక్ష్యాల సాధనలోనూ కీలక పాత్ర పోషిస్తోంది. దీనికి నిదర్శనమే హసన్ అనే 'ఎక్స్' (ట్విట్టర్) యూజర్ కథ. అతను చాట్‌జీపీటీ సహాయంతో ఏకంగా 27 కిలోల బరువు తగ్గి అందరి దృష్టినీ ఆకర్షించాడు.

హసన్ జిమ్‌కు వెళ్లలేదు, ఖరీదైన డైట్ ప్లాన్‌లు పాటించలేదు. బదులుగా, చాట్‌జీపీటీని తన పర్సనల్ ట్రైనర్‌గా, గైడ్‌గా వాడుకున్నాడు. రోజూ క్రమం తప్పకుండా సరైన ప్రాంప్ట్‌లు (ప్రశ్నలు/ఆదేశాలు) ఇస్తూ ఒక పద్ధతి ప్రకారం ముందుకు సాగాడు. "చాట్‌జీపీటీని నా పర్సనల్ ట్రైనర్‌గా భావించి 27 కిలోలు తగ్గాను. రోజూవారీ క్రమశిక్షణ, సరైన ప్రాంప్ట్‌లు నాకు ఒక పద్ధతిని నేర్పాయి" అని హసన్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.

బరువు తగ్గాలనుకునే ఇతరులకు స్ఫూర్తినిస్తూ, తాను ఉపయోగించిన 7 కీలకమైన ప్రాంప్ట్‌లను కూడా అతను షేర్ చేశాడు. వీటిలో శరీర విశ్లేషణ, లక్ష్య నిర్ధారణ, బడ్జెట్‌లో దొరికే పదార్థాలతో మీల్ ప్లాన్, ఇంట్లోనే పరికరాలు లేకుండా చేసుకునే వర్కవుట్లు, తీపి తినాలనే కోరికను నియంత్రించే చిట్కాలు, అలవాట్లను ట్రాక్ చేసే సిస్టమ్, మానసిక స్థైర్యం కోసం సూచనలు, వారానికోసారి పురోగతిని సమీక్షించుకోవడం వంటివి ఉన్నాయి.

సరైన మార్గదర్శకత్వం, క్రమశిక్షణతో పాటు ఏఐని తెలివిగా ఉపయోగించుకుంటే జిమ్ లేదా కఠినమైన డైటింగ్ లేకుండానే బరువు తగ్గడం లాంటి లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చని హసన్ అనుభవం తెలియజేస్తోంది.


More Telugu News