MTV: సంగీతాభిమానులకు షాక్.. 'ఎంటీవీ' మ్యూజిక్ ఛానెల్స్ శాశ్వతంగా మూత

MTV Music Channels Permanently Closed Shock to Music Fans
  • 1981లో ప్రారంభమైన MTV మ్యూజిక్ ఛానెల్స్ 
  • న్యూ ఇయర్ రోజున చివరి ప్రసారం
  • భావోద్వేగంలో మునిగిపోయిన మ్యూజిక్ లవర్స్

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది సంగీతాభిమానుల జీవితాల్లో భాగమైన MTV మ్యూజిక్ ఛానెల్స్ ఇక చరిత్రలోకి వెళ్లిపోయాయి. నాలుగు దశాబ్దాలుగా సంగీత వీడియోలతో ఒక తరం అభిరుచులను మార్చిన ఈ ఛానెల్స్‌కు డిసెంబర్ 31తో శాశ్వతంగా తెరపడింది. పారామౌంట్ గ్లోబల్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న MTV, తమ అనుబంధంగా నడిచిన 24 గంటల మ్యూజిక్ ఛానెల్స్‌ను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో మ్యూజిక్ టెలివిజన్ ప్రపంచంలో ఒక కీలక అధ్యాయం ముగిసినట్టైంది.


భావోద్వేగ వీడ్కోలుగా, 1981 ఆగస్టు 1న MTV ప్రారంభమైనప్పుడు ప్రసారమైన తొలి మ్యూజిక్ వీడియోనే చివరిసారిగా ఆన్ ఎయిర్ చేసింది. బగుల్స్ బృందం పాడిన ‘వీడియో కిల్డ్ ది రేడియో స్టార్’ పాటతోనే MTV తన ప్రయాణానికి ముగింపు పలకడం అభిమానులను భావోద్వేగానికి గురి చేసింది. న్యూ ఇయర్ ఈవ్ రోజున ఈ వీడియో ప్రసారం కావడంతో, సోషల్ మీడియాలో ‘MTV మెమరీస్’ పేరుతో అనేక పోస్టులు వెల్లువెత్తాయి.


ఈ నిర్ణయానికి అనుగుణంగా యుకేలోని MTV Music, MTV 80s, MTV 90s, Club MTV, MTV Live వంటి ప్రముఖ ఛానెల్స్ పూర్తిగా ఆఫ్ ఎయిర్ అయ్యాయి. ప్రత్యేకంగా MTV 90s ఛానెల్ చివరి వీడియోగా స్పైస్ గర్ల్స్ పాడిన ‘గుడ్‌బై’ను ప్రసారం చేసింది. ప్రస్తుతం ఈ ఛానెల్స్‌ను ట్యూన్ చేసినప్పుడు కేవలం లోగోలు మాత్రమే కనిపిస్తూ, MTV కంటెంట్‌ను MTV HDలో చూడవచ్చని సూచనలు వస్తున్నాయి.


అమెరికాలో MTV భవిష్యత్తుపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. ఈ విషయంపై MTV గానీ, దాని మాతృ సంస్థ పారామౌంట్–స్కైడాన్స్ గానీ అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.


1981లో అమెరికాలో ప్రారంభమైన MTV, ఆ తర్వాత 1987లో యూకే, ఐర్లాండ్‌లలోకి అడుగుపెట్టింది. మొదట పూర్తిగా సంగీత వీడియోలకే పరిమితమైన ఈ ఛానెల్, కాలక్రమేణా రియాలిటీ షోలు, యూత్ కార్యక్రమాల వైపు మళ్లింది. దీంతో అసలు సంగీత స్వరూపం కొంతమేర తగ్గింది. పారామౌంట్ సీఈఓ డేవిడ్ ఎలిసన్ మాట్లాడుతూ... భవిష్యత్తులో MTVతో పాటు ఇతర కేబుల్ ఛానెల్స్‌ను కొత్త రూపంలో పునరుజ్జీవింపజేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. అయితే, దానికి సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడించలేదు.


ఇదే సమయంలో MTV యూరప్ మ్యూజిక్ అవార్డ్స్, MTV లాటిన్ అమెరికా MIAW అవార్డ్స్ వంటి ప్రముఖ అవార్డు కార్యక్రమాలను కూడా సంస్థ రద్దు చేసింది. అలాగే ఆస్ట్రేలియా, పోలాండ్, ఫ్రాన్స్, బ్రెజిల్ వంటి దేశాల్లోనూ సంగీతానికే అంకితమైన MTV ఛానెల్స్ మూతపడనున్నాయనే సమాచారం వెలువడుతోంది.


ఒకప్పుడు యువత ఫ్యాషన్, సంగీత అభిరుచులు, పాప్ కల్చర్‌ను నిర్ణయించిన MTV మ్యూజిక్ ఛానెల్స్ ఇలా ముగియడంతో, ఒక తరం జ్ఞాపకాలకు వీడ్కోలు పలికినట్టైంది. అభిమానుల మనసుల్లో మాత్రం MTV ఎప్పటికీ మరిచిపోలేని సంగీత ప్రయాణంగా నిలిచిపోతుంది.

MTV
MTV Music Channels
Music Television
Paramount Global
David Ellison
MTV Europe Music Awards
MTV Latin America MIAW Awards
Music Videos
MTV 80s
MTV 90s

More Telugu News