Harish Rao: తెలంగాణ శాసనసభలో గందరగోళం.. హరీశ్ రావు సూచనను తిరస్కరించిన స్పీకర్

Uproar in Telangana Assembly Over Urea Shortage Harish Rao Intervention
  • అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుల నిరసన
  • రైతులకు యూరియా అందడం లేదంటూ ప్రభుత్వంపై విమర్శలు
  • యూరియా అంశంపై పాయింట్ ఆఫ్ ఆర్డర్ కోరిన హరీశ్

తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాల రెండో రోజు తీవ్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరత అంశంపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అసెంబ్లీలో పెద్ద ఎత్తున నిరసనకు దిగింది. ఈ ఉదయం సభ ప్రారంభమైన వెంటనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని అసెంబ్లీ హాల్‌లోకి వచ్చారు. “కాంగ్రెస్ వచ్చింది.. రైతులను నిండా ముంచింది” అంటూ నినాదాలు చేస్తూ ప్రభుత్వంపై వారు తీవ్ర విమర్శలు గుప్పించారు. వ్యవసాయ సీజన్ కీలక దశలో ఉన్నప్పటికీ రైతులకు సకాలంలో యూరియా అందడం లేదని, దీంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.


యూరియా కొరతపై వెంటనే చర్చ చేపట్టాలని కోరుతూ బీఆర్ఎస్ సభ్యులు వాయిదా తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. రైతుల సమస్యలను పక్కనపెట్టి సభను సాధారణ కార్యక్రమాలతో కొనసాగించడం సరికాదని వారు స్పష్టం చేశారు. అయితే ప్రతిపక్షాల నిరసనపై శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా స్పందించారు. ప్రతిపక్ష సభ్యులకు ప్రశ్నోత్తరాల సమయం జరగడం ఇష్టం లేనట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. సమస్యలుంటే సభలో సరైన పద్ధతుల్లో చర్చకు రావాలని, కానీ ఇలా నినాదాలు చేస్తూ సభా సమయాన్ని వృథా చేయడం సరైంది కాదని మంత్రి సూచించారు.


ఈ క్రమంలో, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు యూరియా అంశంపై పాయింట్ ఆఫ్ ఆర్డర్ కోరారు. అయితే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దానికి అనుమతి నిరాకరించారు. ప్రశ్నోత్తరాల సమయంలో పాయింట్ ఆఫ్ ఆర్డర్‌కు అవకాశం లేదని బీఆర్ఎస్ నేత హరీశ్ రావుకు తేల్చి చెప్పారు. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు వెనక్కి తగ్గకుండా తమ నిరసనను కొనసాగించడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది.


రైతులకు యూరియా సరఫరా అంశంపై ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వలేదని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా, ప్రభుత్వం మాత్రం ప్రతిపక్షం కావాలనే సభను అడ్డుకుంటోందని కౌంటర్ ఇస్తోంది. ఈ పరిణామాలతో శాసనసభలో ప్రభుత్వం–ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రమయ్యింది.

Harish Rao
Telangana Assembly
BRS
Gadadam Prasad Kumar
Sridhar Babu
Urea shortage
Telangana farmers
Winter sessions
Point of Order
Assembly proceedings

More Telugu News