అమరావతి నిర్మాణ పనుల్లో మరో కీలక అడుగు.. పంపింగ్ స్టేషన్-2 పనులకు టెండర్ల ఖరారు!
- ఉండవల్లి వద్ద పంపింగ్ స్టేషన్-2 నిర్మాణం
- మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాకు నిర్మాణ పనుల అప్పగింత
- రాజధాని ప్రాంతంలో నీటి ముంపు ఏర్పడకుండా ఉండటమే ప్రాజెక్టు లక్ష్యం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వరద సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాజధాని ప్రాంతంలో భారీ వర్షాలు కురిసినప్పుడు, నీరు నిల్వలు ఏర్పడకుండా ఉండేందుకు చేపడుతున్న వరద నియంత్రణ చర్యల్లో భాగంగా, ఉండవల్లి గ్రామం వద్ద ‘పంపింగ్ స్టేషన్–2’ నిర్మాణానికి టెండర్లను ప్రభుత్వం ఖరారు చేసింది.
అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ADCL) ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును జోన్–8 పరిధిలో నిర్మించనున్నారు. ఈ పంపింగ్ స్టేషన్ ద్వారా వరదల సమయంలో సుమారు 8,400 క్యూసెక్కుల నీటిని కృష్ణా నదిలోకి పంపించేలా డిజైన్ చేశారు. వర్షాకాలంలో రాజధాని ప్రాంతంలో నీటి ముంపు ఏర్పడకుండా ముందస్తు రక్షణ కల్పించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.
ఈ పనులకు సంబంధించిన టెండర్లలో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రా (MEIL) సంస్థ L1 బిడ్‌గా నిలవడంతో, ఆ సంస్థకే ప్రాజెక్టు బాధ్యతలను అప్పగిస్తూ ADCL నిర్ణయం తీసుకుంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా ఆమోదం తెలిపింది. మొత్తం రూ.443.76 కోట్ల అంచనా వ్యయంతో ఈ పంపింగ్ స్టేషన్ నిర్మాణం చేపట్టనున్నారు.
ప్రాజెక్టులో భాగంగా కేవలం నిర్మాణమే కాకుండా, సర్వే, డిజైన్, అలాగే నిర్మాణం పూర్తయిన తర్వాత 15 ఏళ్ల పాటు నిర్వహణ, ఆపరేషన్ బాధ్యతలు కూడా MEIL సంస్థే చూసుకోనుంది. దీని వల్ల దీర్ఘకాలికంగా వరద నియంత్రణ వ్యవస్థ సక్రమంగా పనిచేసే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (CRDA)తో పాటు ప్రపంచ బ్యాంక్, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ సహకారంతో సమీకరించనున్నారు. రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా ఈ నిధులను వినియోగించనున్నారు.
టెండర్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో, పనులు ఆలస్యం కాకుండా వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ అధికారిక ఉత్తర్వులు విడుదల చేశారు.
అమరావతిలో వరద నియంత్రణకు ఇది అత్యంత కీలకమైన ప్రాజెక్టుగా అధికారులు భావిస్తున్నారు. పంపింగ్ స్టేషన్–2 పూర్తయితే, వర్షాకాలంలో రాజధాని ప్రాంతంలో నీటి ముంపు సమస్యలు గణనీయంగా తగ్గుతాయని, కృష్ణా నదిలోకి వరద నీటిని సురక్షితంగా మళ్లించేందుకు బలమైన వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. రాజధాని నిర్మాణంలో ఇప్పటికే కొనసాగుతున్న మౌలిక వసతులకు ఈ ప్రాజెక్టు మరింత బలాన్ని చేకూర్చనుంది.