Duvvada Madhuri: దువ్వాడ మాధురి - అప్పన్న ఆడియో వ్యవహారంలో కీలక మలుపు

Duvvada Madhuri Appanna Audio Case Takes a Key Turn
  • కనిపించకుండా పోయిన అప్పన్న
  • ఇద్దరు వ్యక్తులు తన భర్తను తీసుకెళ్లారని అప్పన్న భార్య ఫిర్యాదు
  • రాజకీయాలకు తాము బలైపోయామని ఆవేదన

శ్రీకాకుళం జిల్లాలో దువ్వాడ మాధురి – అప్పన్న ఆడియో వ్యవహారం ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధానంగా వినిపిస్తున్న అప్పన్న ఒక్కసారిగా కనిపించకుండా పోవడం కలకలం రేపుతోంది. అప్పన్న ఆచూకీ తెలియకపోవడంతో ఆయన కుటుంబం తీవ్ర ఆందోళనలో ఉంది.


అప్పన్న భార్య శ్రీకాకుళం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ, డిసెంబర్ 29 నుంచి తన భర్త కనిపించడం లేదని పేర్కొన్నారు. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి తన భర్తను తీసుకెళ్లారని ఆమె ఫిర్యాదులో తెలిపారు. అది పోలీసుల విచారణ కోసమా? లేక కిడ్నాప్ చేశారా? అన్నది వెంటనే తేల్చాలని ఆమె ఎస్పీని కోరారు.


భర్తకు ప్రాణహాని ఉందేమోనని అప్పన్న భార్య కన్నీళ్లతో ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలకు తాము బలైపోయామని, ఈ వ్యవహారం వల్ల కుటుంబం మొత్తం మానసికంగా, శారీరకంగా క్షోభకు గురవుతోందని వాపోయారు. ఏడాదిన్నర కాలంగా తమ సొంత గ్రామమైన నిమ్మాడకు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొందని ఆమె తెలిపారు.


ఈ ఘటనకు ముందు వెలుగులోకి వచ్చిన ఆడియో ఇప్పటికే పెద్ద సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దువ్వాడ శ్రీనివాస్‌కు సన్నిహితురాలిగా చెప్పుకుంటున్న మాధురి విడుదల చేసిన ఆ ఆడియోలో... దువ్వాడ శ్రీనివాస్‌పై దాడి చేసే ప్లాన్ ఉందని అప్పన్న మాట్లాడినట్లు వినిపించింది. నరసన్నపేట లేదా నిమ్మాడ జంక్షన్ వద్ద దాడి జరిగే అవకాశం ఉందని, శ్రీనివాస్ ప్రాణాలకు ముప్పు ఉందని అప్పన్న చెప్పినట్లు ఆ ఆడియోలో ఉంది.


ఈ ఆడియో బయటకు వచ్చినప్పటి నుంచే రాజకీయ, పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. ఇప్పుడు అదే కేసులో కీలకంగా ఉన్న అప్పన్న కనిపించకుండా పోవడం మరిన్ని అనుమానాలకు దారి తీస్తోంది. ఇది విచారణలో భాగమా? లేక నిజంగానే కిడ్నాప్ ఘటననా? అన్నది తేలాల్సి ఉంది.


ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. అప్పన్న ఆచూకీపై స్పష్టత రావాల్సి ఉండటంతో పాటు, ఈ మొత్తం వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంత వరకు ఉందన్న దానిపై త్వరలో నిజాలు బయటపడే అవకాశముంది. ఈ ఘటనపై పూర్తి నిజాలు వెలుగులోకి రావాలని, తమకు న్యాయం జరగాలని అప్పన్న కుటుంబం కోరుతోంది.

Duvvada Madhuri
Appanna
Srikakulam
Audio Controversy
Missing Person
Kidnapping
Duvvada Srinivas
Nimmada
Andhra Pradesh Politics
Police Investigation

More Telugu News