Kotha Prabhakar Reddy: దుర్గం చెరువు కబ్జా ఆరోపణలు.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు

BRS MLA Kotha Prabhakar Reddy Booked in Durgam Cheruvu Encroachment Case
  • దుర్గం చెరువులో 5 ఎకరాల స్థలం ఆక్రమించారని ఆరోపణలు
  • హైడ్రా ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు
  • ఆక్రమిత స్థలాన్ని ప్రైవేట్ ట్రావెల్స్ పార్కింగ్‌కు ఇచ్చినట్లు గుర్తింపు
దుర్గం చెరువు ఆక్రమణల వ్యవహారంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. చెరువు స్థలాన్ని ఆక్రమించారన్న ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్యేతో పాటు వెంకట్ రెడ్డి అనే వ్యక్తిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. హైడ్రా అధికారుల ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుర్గం చెరువు పరిధిలో దాదాపు ఐదు ఎకరాల స్థలాన్ని కబ్జా చేసినట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. చెరువు ప్రాంతాన్ని మట్టి, రాళ్లతో నింపి చదును చేశారని, అనంతరం ఆ స్థలాన్ని ఎస్‌టీఎస్ (STS) ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ వారికి పార్కింగ్ కోసం అద్దెకు ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. ఇలా అక్రమంగా ఆక్రమించిన ప్రభుత్వ భూమి ద్వారా నిందితులు అక్రమ ఆదాయం పొందుతున్నారని హైడ్రా తన ఫిర్యాదులో పేర్కొంది.

వాస్తవానికి 2014లోనే హెచ్‌ఎమ్‌డీఏ దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిపై ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, నోటిఫికేషన్ ఉన్నప్పటికీ నిబంధనలను ఉల్లంఘించి ఆక్రమణలు జరిగాయని అధికారులు గుర్తించారు. ఈ ఆక్రమణలపై హైడ్రా సూపర్వైజర్ క్రాంతి ఆనంద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు స్పందించారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, వెంకట్ రెడ్డిలపై బీఎన్‌ఎస్ చట్టంలోని 329(3), 3(5) సెక్షన్లతో పాటు పీడీపీపీ యాక్ట్ సెక్షన్ 3 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Kotha Prabhakar Reddy
Durgam Cheruvu
Hyderabad
BRS MLA
Land Grabbing
Telangana
HMDA
Madhapur Police
Venkat Reddy
STS Private Transport

More Telugu News