Ali Khamenei: ఖమేనీకి వ్యతిరేకంగా ఇరాన్‌లో తీవ్రస్థాయికి చేరిన నిరసనలు.. ఏడుగురి మృతి

 Iran Protests Intensify Against Khamenei Seven Dead
  • ఐదు రోజులుగా సాగుతున్న ఆందోళనలు
  • 42.5 శాతానికి చేరిన ద్రవ్యోల్బణం
  • పడిపోతున్న కరెన్సీ విలువపై తిరుగుబాటు
  • పాత రాచరిక వ్యవస్థకు మద్దతుగా ‘షా వర్ధిల్లాలి’ అంటూ నినాదాలు
ఇరాన్ సర్వోన్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా సాగుతున్న నిరసనలు 2026 నూతన సంవత్సరం వేళ హింసాత్మకంగా మారాయి. పెరుగుతున్న నిత్యావసర ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుదలపై సామాన్యులు మొదలుపెట్టిన ఈ పోరాటం ఇప్పుడు ఇరాన్ వ్యాప్తంగా ఉన్న పల్లెలకు కూడా పాకింది. వారం రోజులుగా జరుగుతున్న ఘర్షణల్లో ఇప్పటివరకు ఏడుగురు మరణించగా, వందలాది మంది గాయపడినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి.

టెహ్రాన్ యూనివర్సిటీ విద్యార్థులు రోడ్లపైకి వచ్చి "సర్వాధికారికి మరణం" అంటూ నినాదాలు చేశారు. 1979 ఇస్లామిక్ విప్లవం కంటే ముందు ఇరాన్‌ను పాలించిన షా మహమ్మద్ రెజా పహ్లావీ కుమారుడు రెజా పహ్లావీకి నిరసనకారులు మద్దతు పలకడం విశేషం. ప్రస్తుతం అమెరికాలో ప్రవాసంలో ఉన్న రెజా పహ్లావీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ "విజయం మనదే.. ఎందుకంటే మన పోరాటం న్యాయమైనది" అంటూ నిరసనకారులకు సంఘీభావం ప్రకటించారు.

ఇరాన్ రియాల్ విలువ డాలర్‌తో పోలిస్తే సగానికి పడిపోవడం, ద్రవ్యోల్బణం 42.5 శాతానికి చేరడంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. లోర్డెగాన్, కుహదాష్త్, ఇస్ఫహాన్ వంటి నగరాల్లో భద్రతా బలగాలకు, నిరసనకారులకు మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరుగుతోంది. కుహదాష్త్‌లో జరిగిన ఘర్షణలో బాసిజ్ పారామిలిటరీ దళానికి చెందిన అమీర్ హొస్సామ్ ఖోదయారీ ఫర్ద్ అనే వ్యక్తి మరణించగా, మరో 13 మంది గాయపడ్డారు.

పరిస్థితి విషమిస్తుండటంతో ఇరాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఒకవైపు భద్రతా చర్యలు చేపడుతూనే, మరోవైపు చర్చలకు సిద్ధమని ప్రకటించింది. వర్తక సంఘాల ప్రతినిధులతో నేరుగా మాట్లాడతామని ప్రభుత్వ అధికార ప్రతినిధి ఫాతిమా మొహజెరానీ తెలిపారు. కాగా, నిరసనకారులను అణచివేయడానికి ఇరాన్ ఇంటర్నెట్ సేవలను కూడా కొన్ని ప్రాంతాల్లో నిలిపివేసింది.
Ali Khamenei
Iran protests
Iran unrest
economic crisis Iran
Reza Pahlavi
Tehran University
Iran inflation
Basij paramilitary
Iran news
Khodayari Fard

More Telugu News