TTD: తిరుమలలో భక్తుల కోసం టీటీడీ సరికొత్త ఆలోచన

TTD Introduces Mobile Water Dispensing for Tirumala Devotees
  • వైకుంఠ ద్వార దర్శనానికి పోటెత్తిన భక్తులు
  • మూడు రోజుల్లో 1.77 లక్షల మందికి శ్రీవారి దర్శనం
  • తిరుమల హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం
  • భక్తుల కోసం వీపున వాటర్ క్యాన్లతో టీటీడీ సేవలు
  • ప్రాణదాన ట్రస్టుకు చెన్నై భక్తుడి రూ.50 లక్షల విరాళం
తిరుమ‌ల‌ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో వైకుంఠ ద్వార దర్శనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గోవిందనామ స్మరణతో తిరుమల గిరులు మార్మోగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. డిసెంబర్ 30 నుంచి జనవరి 1 వరకు కేవలం మూడు రోజుల్లోనే దాదాపు 33 వేల వాహనాలు తిరుమలకు చేరుకోగా, సుమారు 1,77,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. హుండీ ఆదాయం కూడా రికార్డు స్థాయిలో నమోదైంది. డిసెంబర్ 30న రూ. 2.25 కోట్లు రాగా, 31న ఏకంగా రూ. 4.79 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండే భక్తుల దాహార్తిని తీర్చేందుకు టీటీడీ ఓ వినూత్న ఆలోచనను అమలు చేసింది. ఎండలో అలసిపోయే భక్తులకు తక్షణమే నీరు అందించేలా శ్రీవారి సేవకులు వీపుకు వాటర్ క్యాన్లను (Mobile Water Dispensing) తగిలించుకుని గ్లాసులతో నీటిని అందిస్తున్నారు. వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని బయటకు వచ్చే భక్తులకు ఈ సేవ ఎంతో ఊరటనిస్తోంది. ఈ కొత్త విధానంపై భక్తుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.

ప్రస్తుతం టోకెన్లు లేని భక్తులను కూడా సర్వదర్శనానికి అనుమతిస్తున్నారు. ఆక్టోపస్ భవనం, నారాయణగిరి ఉద్యానవనం మీదుగా క్యూలైన్లను క్రమబద్ధీకరించి, వైకుంఠం క్యూకాంప్లెక్స్-2 ద్వారా భక్తులను లోపలికి పంపిస్తున్నారు. ఇదిలా ఉండగా... చెన్నైకి చెందిన పొన్నయ నాగేశ్వరన్ అనే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.50 లక్షల భారీ విరాళాన్ని ప్రకటించారు. దీనికి సంబంధించిన డీడీని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు ఆయన అందజేశారు.
TTD
Tirumala
Vaikunta Ekadasi
Venkateswara Swamy
Tirumala Tirupati Devasthanams
Devotees
Mobile Water Dispensing
Ponnaiah Nageswaran
BR Naidu
Sri Venkateswara Pranadana Trust

More Telugu News