Archana Dehankar: భర్త కంటే పార్టీయే ముఖ్యం.. నాగ్‌పూర్ మాజీ మేయర్ సంచలన నిర్ణయం

Archana Dehankar Chooses Party Over Husband in Nagpur Election Dispute
  • నాగ్‌పూర్ మున్సిపల్ ఎన్నికల్లో వినాయక్‌కు దక్కని బీజేపీ టికెట్
  • స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన వైనం
  • భర్త తిరుగుబాటును నిరసిస్తూ ఇంటిని వీడి పుట్టింటికి వెళ్లిన మాజీ మేయర్
  • భర్తకు వ్యతిరేకంగా బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేయనున్న అర్చన
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఒక రాజకీయ నాయకురాలి కుటుంబంలో చీలిక తెచ్చాయి. బీజేపీ పట్ల తనకున్న అచంచలమైన విధేయతను చాటుకుంటూ నాగ్‌పూర్ మాజీ మేయర్ అర్చనా దేహంకర్ తన భర్త వినాయక్ దేహంకర్‌ను వదిలి పుట్టింటికి వెళ్లిపోయారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా తన భర్త స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడాన్ని నిరసిస్తూ ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.

వినాయక్ దేహంకర్ నాగ్‌పూర్ మున్సిపల్ ఎన్నికల్లో 17వ వార్డు నుంచి బీజేపీ టికెట్ ఆశించారు. అయితే, పార్టీ నాయకత్వం ఆయనను కాదని, ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన మనోజ్ సాబ్లేకు టికెట్ కేటాయించింది. దీనిని అవమానంగా భావించిన వినాయక్.. బీజేపీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేసిన తమను కాదని బయటి వ్యక్తులకు ప్రాధాన్యం ఇవ్వడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

భర్త తీసుకున్న నిర్ణయాన్ని అర్చనా దేహంకర్ తీవ్రంగా తప్పుబట్టారు. 2009 నుంచి 2012 వరకు తనను మేయర్ పదవిలో కూర్చోబెట్టి, గౌరవించిన పార్టీకి వెన్నుపోటు పొడవటం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. "ఒకే ఇంట్లో ఉంటూ ఇద్దరం పరస్పర విరుద్ధమైన రాజకీయ బాటలో పయనించడం సాధ్యం కాదు. నాకు పార్టీయే ముఖ్యం" అని స్పష్టం చేస్తూ ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. పార్టీ అధికారిక అభ్యర్థి విజయం కోసం ప్రచారం చేయనున్నట్లు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 
Archana Dehankar
Nagpur
Nagpur Municipal Corporation Elections
BJP
Vinayak Dehankar
Maharashtra Politics
Political Defection
Manoj Sable
Indian Politics

More Telugu News