ప్రభాస్ పెళ్లయిన 12 గంటల తర్వాత నా పెళ్లి: నవీన్ పొలిశెట్టి

  • ప్రభాస్‌ను ఉటంకిస్తూ తన పెళ్లిపై నవీన్ తనదైన స్టైల్లో సమాధానం 
  • 'అనగనగా ఒక రాజు' చిత్రంతో సరికొత్త పాత్రలో కనిపించబోతున్న నవీన్
  • మెగాస్టార్ చిరంజీవితో పోటీ లేదని స్పష్టీకరణ
టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ నవీన్ పొలిశెట్టి మరోసారి తన టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. ఆయన హీరోగా, మీనాక్షి చౌదరి కథానాయికగా కల్యాణ్ శంకర్ తెరకెక్కించిన 'అనగనగా ఒక రాజు' చిత్రం ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రచార వేడుకలో నవీన్ తన పెళ్లి నుంచి కెరీర్ స్ట్రగుల్స్ వరకు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే నవీన్ పెళ్లి అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన అదిరిపోయే పంచ్ ఇచ్చాడు. "ప్రభాస్ అన్నయ్య పెళ్లి చేసుకున్న మరుసటి రోజే.. కరెక్ట్‌గా 12 గంటల తర్వాత నేను కూడా వివాహం చేసుకుంటా" అంటూ నవ్వులు పూయించాడు.  

వరుస హిట్లతో దూసుకుపోతున్న నవీన్.. ఈ చిత్రంలో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నట్లు తెలిపారు. "ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ దగ్గర నుంచి ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ వరకు నేను చేసిన ప్రతి పాత్ర భిన్నమైనదే. ఇప్పుడు ఈ సినిమాలో గోదావరి జిల్లాల వెటకారం కలగలిసిన కొత్త తరహా పాత్రలో కనిపిస్తా. ఇది చూస్తున్నప్పుడు నా పాత సినిమాలు ఏవీ మీకు గుర్తుకు రావు" అని ధీమా వ్యక్తం చేశారు.

ఈ సంక్రాంతికి పెద్ద సినిమాల పోటీపై స్పందిస్తూ.. "మెగాస్టార్ చిరంజీవి మాలాంటి ఎందరో మధ్యతరగతి కుర్రాళ్లకు స్ఫూర్తి. ఆయన బాటలోనే మేము ఇక్కడి వరకు వచ్చాం. గురువుగారి సినిమాతో పాటు మా సినిమా రావడం ఒత్తిడిని కాదు, ఉత్సాహాన్ని ఇస్తుంది" అని చెప్పాడు. ముంబైలో పెళ్లిళ్లకు హోస్ట్‌గా పనిచేసిన గతాన్ని గుర్తు చేసుకుంటూ.. కష్టపడి పైకి వచ్చిన ప్రయాణమే తనను ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టిందని నవీన్ పొలిశెట్టి భావోద్వేగానికి లోనయ్యాడు.


More Telugu News