చంద్రబాబు ఒక రాజనీతిజ్ఞుడు... కేసీఆర్ విమర్శలు దుర్మార్గం: ఏపీ మంత్రి ఆనం

  • తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌పై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఫైర్
  • కూటమి ప్రభుత్వంపై కేసీఆర్ విమర్శలు దుర్మార్గమైనవని వ్యాఖ్య
  • కేసీఆర్‌కు నచ్చితే ఎంత, నచ్చకపోతే ఎంత అంటూ ఫైర్
  • చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో రామరాజ్యం మొదలైందన్న ఆనం
  • ప్రతిపక్షాలు ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయని ఆరోపణ
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీలోని కూటమి ప్రభుత్వంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయని, అవి దుర్మార్గమైనవని మండిపడ్డారు. గురువారం నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన, కేసీఆర్ వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చారు.

“ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక రాజనీతిజ్ఞుడు అని ప్రపంచమంతా కీర్తిస్తోంది. అలాంటిది... కేసీఆర్‌కు నచ్చితే ఎంత? నచ్చకుపోతే ఎంత?” అంటూ ఆనం మండిపడ్డారు. రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ నేతృత్వంలో సుపరిపాలన అందిస్తున్నామని, దీన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు నిస్సిగ్గుగా ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయని, కొందరు నాయకులు సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రామరాజ్యం ప్రారంభమైందని అన్నారు. తన నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఇంతటి సుపరిపాలన చూడలేదని, కొత్త సంవత్సరంలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

కేసీఆర్ ఏమన్నారంటే...!

ఇటీవల బీఆర్ఎస్ నేతలతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కేసీఆర్, తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా, పెట్టుబడుల ఆకర్షణ కోసం నిర్వహించే సదస్సులు, చేసుకునే అవగాహన ఒప్పందాల (ఎంవోయూ) విషయంలో చంద్రబాబు అనుసరించిన వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.

"రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు బిజినెస్ మీట్‌లు పెట్టడం, ఎంవోయూలు చేసుకోవడం సహజం. కానీ, గ్లోబల్ సమ్మిట్ పేరుతో దీనికి అనవసరమైన హైప్ క్రియేట్ చేయడం దేనికి? ఈ హైప్‌ కల్చర్‌కు ఆద్యుడు చంద్రబాబే కదా?" అని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో, విభజన తర్వాత ఏపీ సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు కుదిరిన ఒప్పందాలపై కేసీఆర్ ఘాటుగా స్పందించారు. "చంద్రబాబు చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే, ఈపాటికి ఆంధ్రప్రదేశ్‌కు రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రావాలి. కానీ కనీసం రూ.10 వేల కోట్లు కూడా రాలేదు" అని ఎద్దేవా చేశారు.

ఈ క్రమంలోనే విశాఖలో జరిగిన ఓ పారిశ్రామిక సదస్సు గురించి కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "చంద్రబాబు తొలిసారి సీఎంగా ఉన్నప్పుడు విశాఖలో జరిగిన సదస్సులో ఎంవోయూలపై ఎవరు సంతకాలు పెట్టారో తెలుసా? వంట మనుషులు! స్టార్ హోటళ్లలో పనిచేసే వంటవాళ్లు, సప్లై చేసేవాళ్లతో సంతకాలు పెట్టించారు" అంటూ వ్యాఖ్యానించారు. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల హామీలు ఇచ్చి, కనీస పెట్టుబడులు కూడా రాబట్టలేకపోయారని విమర్శించారు. 


More Telugu News