Simhachalam: సింహాచలం పులిహోర ప్రసాదంలో నత్త... కుట్ర అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులు

Simhachalam Temple Pulihara Prasadam Controversy Leads to Police Complaint
  • సింహాచలం పులిహోరలో నత్త ఉందంటూ దంపతుల ఆరోపణ
  • సోషల్ మీడియాలో వీడియో పెట్టడంతో రాజుకున్న వివాదం
  • ఆలయ ప్రతిష్ఠ దెబ్బతీసే కుట్రగా అనుమానిస్తున్న ఆలయ వర్గాలు
  • దుష్ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు
  • దంపతులను విచారించి, నిజానిజాలు తేలుస్తామన్న పోలీసులు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో విక్రయించే పులిహోర ప్రసాదంలో నత్త వచ్చిందంటూ ఓ జంట సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో తీవ్ర వివాదానికి దారితీసింది. ఇది ఆలయ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా చేసిన కుట్ర అని ఆరోపిస్తూ ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వివరాల్లోకి వెళితే, ఇటీవల ఆలయాన్ని సందర్శించిన దంపతులు పులిహోర ప్యాకెట్ కొనుగోలు చేశారు. ప్యాకెట్ తెరిచిన తర్వాత అందులో ఓ చిన్న నత్త కనిపించిందని, దీనిపై సిబ్బందికి ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని ఆరోపిస్తూ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియో వేగంగా వైరల్ కావడంతో భక్తుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఈ ఆరోపణలను ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) ఎన్. సుజాత తీవ్రంగా ఖండించారు. ఇది ఆలయంపై దుష్ప్రచారం చేసే కుట్రలో భాగమేనని ఆమె అన్నారు. "వంటశాలలో అత్యధునిక యంత్రాలతో పులిహోర తయారు చేస్తాం. ఒకవేళ అందులో నత్త పడితే దాని గుల్ల నలిగిపోతుంది. కానీ, వీడియోలో నత్త చెక్కుచెదరకుండా ఉంది. ప్రసాదం కొన్న తర్వాత బయట ఎవరైనా దాన్ని అందులో వేసి ఉండవచ్చు" అని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఆ రోజు 15 వేలకు పైగా పులిహోర ప్యాకెట్లు విక్రయించగా, మరెక్కడా ఇలాంటి ఫిర్యాదు రాలేదని ఆమె స్పష్టం చేశారు.

ఆలయ వర్గాల ఫిర్యాదు మేరకు గోపాలపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వీడియో పోస్ట్ చేసిన వారి ఉద్దేశాన్ని, దాని ప్రామాణికతను పరిశీలిస్తున్నామని తెలిపారు. వంటశాలలోని సీసీటీవీ ఫుటేజీని, ప్రసాదం తయారీ ప్రక్రియను సమీక్షిస్తున్నామని, త్వరలోనే ఆ దంపతులను విచారణకు పిలుస్తామని పోలీసులు వెల్లడించారు. 
Simhachalam
Simhachalam temple
Varaha Lakshmi Narasimha Swamy
pulihara prasadam
temple prasadam
food safety
Andhra Pradesh temples
controversy
police investigation

More Telugu News