బంగ్లాదేశ్‌లో మరో హిందువుపై దాడి చేసి నిప్పంటించిన మూక

  • షరియత్‌పూర్ జిల్లాలోని 50 ఏళ్ల ఖోకోన్ దాస్‌పై దాడి
  • ఖోకోన్ దాస్ ఇంటికి వెళుతున్న సమయంలో దాడి చేసిన మూక
  • బంగ్లాదేశ్‌లో రెండు వారాల్లో హిందువులపై నాలుగో దాడి
బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తిపై దాడి జరిగింది. షరియత్‌పూర్ జిల్లాలో 50 ఏళ్ల ఖోకోన్ దాస్‌పై డిసెంబర్ 31న దాడి చేసి, అనంతరం నిప్పంటించి హత్య చేసేందుకు ప్రయత్నించారు. బాధితుడు దాస్ ఇంటికి వెళుతుండగా ఒక సమూహం పదునైన ఆయుధాలతో దాడి చేసింది. బంగ్లాదేశ్‌లో రెండు వారాల్లోనే హిందువులపై ఇది నాలుగో దాడి.

డిసెంబర్ 24న కళిమొహర్ యూనియన్‌లోని హొసైన్‌డంగా ప్రాంతంలో 29 ఏళ్ల అమృత్ మండల్‌‌పై దాడి చేసి హతమార్చారు. అంతకుముందు డిసెంబర్ 18న మైమెన్‌సింగ్‌ జిల్లాలోని ఒక ఫ్యాక్టరీలో తప్పుడు ఆరోపణలపై 25 ఏళ్ల హిందూ యువకుడు దీపూ చంద్ర దాస్‌పై మూక దాడి చేసి చంపేసింది. ఈ ఘటనల నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో మానవ హక్కుల ఉల్లంఘనపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. బంగ్లాదేశ్‌లోని మైనారిటీ హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులపై జరుగుతున్న దాడులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

ఢిల్లీలో తలదాచుకుంటున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తన దేశంలో మైనారిటీలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. యూనస్ ప్రభుత్వం మైనారిటీలను రక్షించడంలో విఫలమైందని, తీవ్రవాదులు రాజ్యమేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


More Telugu News