ఎట్టకేలకు 'ప్రమోషన్స్'కు సై అన్న నయనతార... అనిల్ రావిపూడితో వీడియో అదుర్స్!

  • చిరంజీవి సినిమా కోసం తన నియమాన్ని పక్కనపెట్టిన నయనతార
  • 'మన శంకర వరప్రసాద్ గారు' ప్రమోషన్లలో పాల్గొననున్న నయన్
  • దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి ఫన్నీ ప్రమోషనల్ వీడియో
  • నయనతార స్వయంగా ప్రకటించిన సినిమా విడుదల తేదీ
  • జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం
లేడీ సూపర్ స్టార్ నయనతార తన కెరీర్‌లో ఇప్పటివరకు పాటిస్తూ వస్తున్న ఒక కఠినమైన నియమాన్ని పక్కనపెట్టారు. సినిమా షూటింగ్ పూర్తయ్యాక ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉండే ఆమె, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం కోసం తొలిసారిగా ప్రమోషన్లలో పాల్గొనేందుకు అంగీకరించారు. ఈ విషయాన్ని చిత్ర బృందం ఒక ఆసక్తికరమైన వీడియో ద్వారా అధికారికంగా ప్రకటించింది.

దర్శకుడు అనిల్ రావిపూడి ఈ క్రియేటివ్ ప్రమోషనల్ వీడియోను విడుదల చేశారు. ఇందులో నయనతార, దర్శకుడు అనిల్ రావిపూడి మధ్య సరదా సంభాషణను చూపించారు. "ఏంటి అనిల్... సినిమా ప్రారంభంలో మంచి ప్రమోషన్స్ చేశావు. ఇప్పుడు సినిమా అయిపోయింది. ప్రమోషన్స్ ఏమీ లేవా?" అని నయనతార అడగడంతో, ఆశ్చర్యపోయిన అనిల్ రావిపూడి సరదాగా కళ్లు తిరిగి పడిపోయినట్టు నటించారు.

ఆ తర్వాత తేరుకొని, "మీ అంతట మీరు ప్రమోషన్ అని అడగటమే పెద్ద ప్రమోషన్. జనవరి 12న సినిమా రిలీజ్ అని అనౌన్స్ చేయండి చాలు" అని అనిల్ చెప్పగా, నయనతార తనదైన శైలిలో సినిమా విడుదల తేదీని ప్రకటించారు. దీంతో 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్ర ప్రమోషన్లలో నయనతార చురుకుగా పాల్గొననున్నారని స్పష్టమైంది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.


More Telugu News