మూతపడుతున్న వందలాది టెక్స్‌టైల్ మిల్లులు.. భారత్, బంగ్లాదేశ్ దెబ్బకు పాక్ కుదేలు

  • ఉత్పత్తి వ్యయం తట్టుకోలేక మూతపడుతున్న పాక్ ఫ్యాక్టరీలు
  • వరుసగా నాలుగో నెలలోనూ తగ్గిన టెక్స్‌టైల్ ఎగుమతులు
  • భారత్, బంగ్లాదేశ్, వియత్నాం నుంచి గట్టి పోటీ
  • అధ్వానంగా పత్తి ఉత్పత్తి.. చెరకు సాగు వైపు మళ్లుతున్న రైతులు
  • కరెంట్ చార్జీలు, పన్నుల భారం వల్లే ఈ దుస్థితి
ఒకప్పుడు పాకిస్థాన్ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషించిన టెక్స్‌టైల్ (జౌళి) పరిశ్రమ ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. పెరిగిన ఉత్పత్తి ఖర్చులు, విద్యుత్ చార్జీల భారం, తగ్గిన పత్తి దిగుబడి కారణంగా ఆ దేశంలోని ఫ్యాక్టరీలు వరుసగా మూతపడుతున్నాయి. ఈ మేరకు పాక్ టెక్స్‌టైల్ రంగం ఎదుర్కొంటున్న దుస్థితిపై యూకేకు చెందిన 'డైలీ మిర్రర్' ఒక కథనాన్ని ప్రచురించింది.

పాకిస్థాన్ టెక్స్‌టైల్ ఎక్స్ పోర్టర్స్ అసోసియేషన్ (పీటీఈఏ) ప్రకారం.. అక్కడి టెక్స్‌టైల్ ఎగుమతులు వరుసగా నాలుగో నెలలోనూ తగ్గుముఖం పట్టాయి. గతేడాది జూలై నుంచి నవంబర్ మధ్య కాలంలో ఎగుమతులు 6.39 శాతం తగ్గి, 12.844 బిలియన్ డాలర్లకు పడిపోయినట్లు పీటీఈఏ జనరల్ సెక్రటరీ అజీజుల్లా గోహీర్ తెలిపారు. ఒకప్పుడు 19.3 బిలియన్ డాలర్లుగా ఉన్న ఎగుమతులు క్రమంగా 17 బిలియన్ డాలర్లకు, అక్కడి నుంచి మరింత కిందకు పడిపోవడమే తప్ప కోలుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు భారత్, బంగ్లాదేశ్, చైనా, వియత్నాం దేశాలు తక్కువ ఖర్చుతో వస్త్రాలను ఉత్పత్తి చేస్తూ ప్రపంచ మార్కెట్లో పాకిస్థాన్ వాటాను దెబ్బతీస్తున్నాయి. ఆయా దేశాల్లో స్థిరమైన ప్రభుత్వ విధానాలు, తక్కువ విద్యుత్ చార్జీలు ఉండటంతో పాక్ పరిశ్రమలు వాటితో పోటీపడలేకపోతున్నాయి.

దీనికి తోడు పాకిస్థాన్‌లో పత్తి ఉత్పత్తి దారుణంగా పడిపోయింది. పాత సాగు పద్ధతులు, నాసిరకం విత్తనాల వల్ల 15 మిలియన్ల బేళ్లుగా ఉండే పత్తి ఉత్పత్తి ప్రస్తుతం 5.5 మిలియన్ల బేళ్లకు పడిపోయిందని పాకిస్థాన్ కాటన్ జిన్నర్స్ ఫోరమ్ ఛైర్మన్ ఇహసానుల్ హక్ తెలిపారు. ఇప్పటికే 100 స్పిన్నింగ్ మిల్లులు, 400 జిన్నింగ్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయన్నారు. పత్తి ధర క్వింటాలుకు కాకుండా 40 కిలోలకు రూ.8,000 మేర పడిపోవడంతో రైతులు పత్తి సాగు మానేసి చెరకు సాగు వైపు మళ్లుతున్నారు.

విద్యుత్ చార్జీలు, పన్నుల భారం కూడా పరిశ్రమ నడ్డి విరుస్తోంది. ప్రాంతీయ పోటీదారులు యూనిట్ విద్యుత్‌కు 5-9 సెంట్లు చెల్లిస్తుంటే, పాకిస్థాన్‌లో అది 12 సెంట్లకు చేరుకునేలా ఉంది. తరచూ విద్యుత్ కోతలు, గ్రిడ్ సమస్యలు, ఎగుమతి విధానాల్లో మార్పులు, రవాణా సమ్మెలు పాక్ టెక్స్‌టైల్ రంగాన్ని కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.


More Telugu News