Switzerland Bar Explosion: నూతన సంవత్సర వేడుకల్లో విషాదం.. స్విస్ బార్‌లో భారీ పేలుడు.. పలువురు పర్యాటకుల మృతి

Many Killed In Blast At Swiss Bar Where Over 100 People Were Partying
  • స్విట్జర్లాండ్‌లోని క్రాన్స్-మోంటానా బార్‌లో భారీ పేలుడు
  • న్యూ ఇయర్ వేడుకల సమయంలో చోటుచేసుకున్న విషాదం
  • పలువురు మృతి.. భారీ సంఖ్యలో గాయపడిన పర్యాటకులు
  • ప్రమాద సమయంలో బార్‌లో 100 మందికి పైగా ఉన్నట్లు గుర్తింపు
స్విట్జర్లాండ్‌లో నూతన సంవత్సర వేడుకలు తీవ్ర విషాదాంతమయ్యాయి. క్రాన్స్-మోంటానా అనే ప్రముఖ లగ్జరీ స్కీ రిసార్ట్‌లోని ఓ బార్‌లో గురువారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. 'లీ కాన్స్టెలేషన్' (Le Constellation) అనే బార్‌లో పర్యాటకులు న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటుండగా ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు మృతిచెంద‌గా, అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు.

ఘటన జరిగిన సమయంలో బార్‌లో 100 మందికి పైగా పర్యాటకులు ఉన్నట్లు సమాచారం. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 1:30 గంటల ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. వాలిస్ కంటోన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పేలుడు ధాటికి మంటలు చెలరేగాయి. అయితే పేలుడుకు గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీస్ ప్రతినిధి గేటన్ లాథియన్ 'ఏఎఫ్‌పీ' వార్తా సంస్థకు వివరించారు. మృతులు, క్షతగాత్రుల్లో ఎక్కువ మంది సెలవుల కోసం వచ్చిన విదేశీ పర్యాటకులేనని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు స్థానిక పత్రిక 'లీ నోవెల్లిస్ట్' కథనం ప్రకారం.. ఈ ప్రమాదంలో దాదాపు 40 మంది మరణించారని, 100 మందికి పైగా గాయపడ్డారని అంచనా వేస్తున్నారు. అయితే మరణాల సంఖ్యపై పోలీసుల నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఓ సంగీత కచేరీ సందర్భంగా కాల్చిన బాణసంచా వల్లే మంటలు అంటుకుని పేలుడు సంభవించి ఉండవచ్చని స్విస్ మీడియా సంస్థ 'బ్లిక్' అనుమానం వ్యక్తం చేసింది.

ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. హెలికాప్టర్ల ద్వారా క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా ఆ ప్రాంతంలో నో-ఫ్లై జోన్ విధించారు. బాధితుల బంధువుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు.
Switzerland Bar Explosion
Switzerland
Krans Montana
Le Constellation Bar
New Year Celebrations
Swiss Alps
Fire Accident
Tourist Deaths
Valais Canton
Ski Resort

More Telugu News