అంతర్వేదిలో విషాద ఘటన... సముద్రంలోకి దూసుకెళ్లిన కారు, ఒకరి మృతి

  • అంతర్వేది సాగర సంగమంలో అపశ్రుతి
  • న్యూ ఇయర్ వేడుకల వేళ సముద్రంలోకి దూసుకెళ్లిన కారు
  • ఘటనలో కారు నడుపుతున్న శ్రీధర్ అనే వ్యక్తి మృతి
  • మరో స్నేహితుడు కారులో నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్న వైనం
  • సముద్రంలో మునిగిన కారును వెలికితీసిన మెరైన్ పోలీసులు
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో నూతన సంవత్సర వేడుకల సమయంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సఖినేటిపల్లి మండలం అంతర్వేది సాగర సంగమం వద్ద ఓ కారు సముద్రంలోకి దూసుకెళ్లడంతో ఒకరు మరణించారు. ఈ దుర్ఘటన బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగింది.

వివరాల్లోకి వెళితే, కాకినాడకు చెందిన నిమ్మలకాయల శ్రీధర్ (35), అతని స్నేహితులు బి.సూర్యకిరణ్, జయకృష్ణ నూతన సంవత్సర వేడుకల కోసం అంతర్వేది బీచ్‌కు వచ్చారు. ముగ్గురూ కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం, శ్రీధర్ కారు నడుపుతుండగా ఒక్కసారిగా వాహనాన్ని సముద్రం వైపు నడిపాడు.

దీంతో అప్రమత్తమైన జయకృష్ణ వెంటనే డోర్ తీసుకుని బయటకు దూకేసి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఆ సమయంలో సూర్యకిరణ్ కారులో లేకపోవడంతో అతనికి ప్రమాదం తప్పింది. కారుతో పాటు శ్రీధర్ సముద్రపు నీటిలో మునిగిపోయి అక్కడికక్కడే మరణించాడు.

సమాచారం అందుకున్న మెరైన్, సివిల్ పోలీసులు గురువారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. సముద్రంలో మునిగిపోయిన కారును, శ్రీధర్ మృతదేహాన్ని వెలికితీశారు. అయితే, శ్రీధర్ ఎందుకు కారును సముద్రం వైపు నడిపాడనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రమాదవశాత్తూ జరిగిందా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడి అన్నా చెల్లెలు గట్టు వద్ద మలుపు గుర్తించలేక జీపుతో సహా గోదావరిలోకి దూసుకెళ్లినట్టు ప్రాథమికంగా భావిస్తున్నారు.


More Telugu News