Andhra Pradesh: కొత్త సంవత్సరం వేళ తీవ్ర విషాదం... ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య

Andhra man kills his three children dies by suicide
  • నంద్యాల జిల్లాలో ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య
  • భార్య మరణంతో మనస్తాపం.. పిల్లలను పెంచలేక అఘాయిత్యం
  • శీతల పానీయంలో పురుగుల మందు కలిపి ఇచ్చినట్లు అనుమానం
ఏపీలోని నంద్యాల జిల్లాలో గుండెలు పిండేసే విషాద ఘటన చోటుచేసుకుంది. కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే.. వారి ప్రాణాలను తీసి, తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉయ్యాలవాడ మండలం తుడుమలదిన్నె గ్రామంలో ఈ దారుణం జరిగింది. గ్రామానికి చెందిన వేములపాటి సురేంద్ర (35) తన ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి చంపి, అనంతరం తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

పోలీసులు తెలిపిన‌ వివరాల ప్రకారం.. గురువారం నాడు సురేంద్రతో పాటు పిల్లలు కావ్యశ్రీ (7), జ్ఞానేశ్వరి (4), సూర్య గగన్ (2) మృతదేహాలను ఇంట్లో గుర్తించారు. పిల్లలకు కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలిపి తాగించి, వారు చనిపోయాక సురేంద్ర ఉరివేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సురేంద్ర భార్య మహేశ్వరి అనారోగ్య కారణాలతో 2025 ఆగస్టు 16న ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి పిల్లల ఆలనాపాలనా సురేంద్ర చూసుకుంటున్నాడు.

నిర్మాణ పనులకు వెళ్లే సురేంద్ర.. భార్య మరణంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీనికి తోడు ఆర్థిక ఇబ్బందులు, పిల్లలను ఒంటరిగా పెంచలేకపోవడం, మద్యానికి బానిస కావడం వంటి కారణాలతో తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. ఈ క్రమంలోనే మద్యం మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని స్థానికులు, పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలంలో ఆహారం, కూల్‌డ్రింక్ శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Andhra Pradesh
Vemulapati Surendra
Nandyala district
Suicide
Children poisoned
Financial problems
Uyylavada
Alcohol addiction
Family tragedy

More Telugu News