Pakistan Drone: ఎల్ఓసీలో పాకిస్థాన్ డ్రోన్ కలకలం.. జారవిడిచిన సామగ్రిని స్వాధీనం చేసుకున్న సైన్యం

Pakistan Drone Spotted at LoC Dropping Suspicious Items
  • నూతన సంవత్సరం వేళ భారత గగనతలంలోకి ప్రవేశించిన డ్రోన్
  • ఐఈడీ, మాదక ద్రవ్యాలు జారవిడిచిన డ్రోన్
  • నియంత్రణ రేఖ వెంబడి గాలింపు చర్యలు చేపట్టిన సైన్యం
జమ్ము కశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి అనుమానిత పాకిస్థాన్ డ్రోన్‌ కదలికను గుర్తించిన భద్రతా దళాలు గాలింపు చర్యలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. నూతన సంవత్సరం వేళ నియంత్రణ రేఖ వెంబడి పాక్ డ్రోన్ కలకలం సృష్టించింది. భారత గగనతలంలోకి ప్రవేశించి ఐఈడీ, మాదక ద్రవ్యాలను జారవిడిచింది. భద్రతా దళాలు ఆ ప్రాంతం నుంచి ఆ ప్యాకెట్‌ను స్వాధీనం చేసుకున్నాయి.

మీడియా కథనాల ప్రకారం, పూంఛ్ సెక్టారులోని నియంత్రణ రేఖ వెంబడి ఈ ఘటన చోటు చేసుకుంది. ఖాదీ కర్మదా ప్రాంతంలోకి పాకిస్థాన్ డ్రోన్ చొరబడి, ఐదు నిమిషాలు అక్కడే చక్కర్లు కొట్టింది. ఈ క్రమంలోనే ఐఈడీ మందుగుండు సామగ్రి, డ్రగ్స్‌ను జారవిడిచింది. డ్రోన్ కదలికలను గుర్తించిన వెంటనే భద్రతా సిబ్బంది, జారవిడిచిన సామగ్రిని స్వాధీనం చేసుకుంది.

ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందా అనే కోణంలో పరిసర ప్రాంతాల్లో భద్రతా దళాలు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. నూతన సంవత్సరంలో పాక్ మద్దతున్న ఉగ్రవాద గ్రూపులు జమ్ము కశ్మీర్‌లో దాడికి ప్లాన్ చేశాయని గతంలో నిఘా వర్గాలు హెచ్చరించినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో భారత సైన్యం, పోలీసులతో కలిసి నియంత్రణ రేఖ వెంబడి గాలింపు చర్యలు చేపట్టింది.
Pakistan Drone
LoC
Jammu Kashmir
Poonch
IED
Drugs
Indian Army
Security Forces
Terrorist Attack

More Telugu News