ఫిబ్రవరి 1 నుంచి భారీగా పెరగనున్న సిగరెట్, పాన్ మసాలా ధరలు

  • సిగరెట్, పాన్ మసాలాపై 40 శాతం జీఎస్టీ, బీడీలపై 18 శాతం జీఎస్టీ
  • ఆరోగ్య, జాతీయ భద్రత సెస్ అదనం
  • ఫిబ్రవరి 1 నుంచి వర్తిస్తుందని కేంద్రం నోటిఫికేషన్
పొగాకు ఉత్పత్తుల ధరలు ఫిబ్రవరి నుంచి భారీగా పెరగనున్నాయి. ఈ ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకం, పాన్ మసాలాపై సెస్సు విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి వర్తిస్తుందని తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది.

పాన్ మసాలా, సిగరెట్లు, పొగాకు సంబంధిత ఉత్పత్తులపై 40 శాతం, బీడీలపై 18 శాతం కేంద్రం జీఎస్టీ విధించింది. పాన్ మసాలాపై ఆరోగ్య, జాతీయ భద్రత సెస్సు పెంపుతో పాటు, పొగాకు సంబంధిత ఉత్పత్తులకు అదనంగా ఎక్సైజ్ సుంకం వేసింది. ఇవి ఫిబ్రవరి నుంచి అమలులోకి రానున్నాయి.

ఫిబ్రవరి 1 నుంచి పాన్ మసాలా, సిగరెట్లు, పొగాకు మరియు సంబంధిత ఉత్పత్తులపై 40 శాతం జీఎస్టీ, బీడీలపై 18 శాతం జీఎస్టీ వర్తిస్తుందని, దీనికి సెస్సు అదనమని ప్రభుత్వ నోటిఫికేషన్ పేర్కొంది. పాన్ మసాలాపై ఆరోగ్య మరియు జాతీయ భద్రతా సెస్సు, పొగాకు మరియు సంబంధిత ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకం ఉంటుందని తెలిపింది. తయారీ కేంద్రాల ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి సెస్ చెల్లించవలసి ఉంటుందని స్పష్టం చేసింది.

పాన్ మసాలా తయారీపై ఆరోగ్య, జాతీయ భద్రత సెస్సు, పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ విధించేలా రెండు బిల్లులను పార్లమెంటు గత డిసెంబర్ నెలలో ఆమోదించిన విషయం విదితమే. 'హెల్త్ సెక్యూరిటీ సే నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లు-2025' బిల్లును ఉభయసభలు ఆమోదించాయి. ఈ పన్నుల ద్వారా సమకూరే నిధులను జాతీయ భద్రత బలోపేతానికి, ప్రజారోగ్యం కోసం ఖర్చు చేయనున్నట్లు బిల్లు ఆమోదం పొందిన అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.


More Telugu News