Sikandar Raza: జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా ఇంట విషాదం

Sikandar Razas Brother Dies Aged 13 Zimbabwe Star Shares Emotional Post
  • హీమోఫీలియా సమస్యతో కన్నుమూసిన రజా తమ్ముడు మహమ్మద్ మెహదీ
  • డిసెంబర్ 30న హరారేలో అంత్యక్రియలు పూర్తి
  • ఈ కష్ట సమయంలో రజాకు అండగా ఉంటామన్న జింబాబ్వే క్రికెట్ బోర్డు
జింబాబ్వే క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ సికిందర్ రజా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన చిన్న తమ్ముడు మహమ్మద్ మెహదీ (13) అనారోగ్యంతో కన్నుమూశాడు. ఈ హఠాత్పరిణామం రజా కుటుంబాన్నే కాకుండా క్రికెట్ వర్గాలను కూడా కలిచివేసింది. జింబాబ్వే క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.

మెహదీ పుట్టుకతోనే హీమోఫీలియా అనే రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఇటీవల ఆరోగ్య సమస్యలు మరింత తీవ్రం కావడంతో 2025 డిసెంబర్ 29న హరారేలో తుదిశ్వాస విడిచాడు. డిసెంబర్ 30న హరారేలోని వారెన్ హిల్స్ శ్మశానవాటికలో మెహదీ అంత్యక్రియలు నిర్వహించినట్లు బోర్డు తెలిపింది. "సికిందర్ రజా కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఈ క్లిష్ట సమయంలో బోర్డు సభ్యులు, మేనేజ్మెంట్, ఆటగాళ్లు, సిబ్బంది అందరూ రజా కుటుంబానికి అండగా ఉంటాం. మెహదీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం" అని జింబాబ్వే క్రికెట్ పేర్కొంది.

ఈ వార్తపై సికిందర్ రజా సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. జింబాబ్వే క్రికెట్ బోర్డు ట్వీట్‌కు రిప్లై ఇస్తూ, ఒక 'బ్రోకెన్ హార్ట్' ఎమోజీని షేర్ చేసి తన ఆవేదనను వ్యక్తం చేశాడు.

కాగా, సికిందర్ రజా వృత్తిపరంగా ఎంతో బిజీగా, మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో ఈ వ్యక్తిగత విషాదం చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన ఐఎల్టీ20 2025 సీజన్‌లో షార్జా వారియర్స్ తరపున రజా అద్భుత ప్రదర్శన చేశాడు. ఆ టోర్నీలో 10 మ్యాచ్‌లు ఆడిన రజా 171 పరుగులు చేయడంతో పాటు 10 వికెట్లు తీసి, టీ20 ఫార్మాట్‌లో తనదైన ముద్ర వేశాడు. ఇంతలోనే సోదరుడి మరణవార్త ఆయనను తీవ్రంగా కృంగదీసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు రజాకు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు.
Sikandar Raza
Zimbabwe cricket
Sikandar Raza brother
Mohammad Mehdi
Zimbabwe cricket board
Sharjah Warriors
ILT20 2025
cricket news
Heamophilia
Harare

More Telugu News