Tejaswi Podapati: పురాతన వస్తువుల విభజనకు కొత్త కమిటీ .. ఏపీ సర్కార్ ఉత్తర్వుల జారీ

Tejaswi Podapati Appointed to Antiquities Division Committee by AP Government
  • 8 మందితో కమిటీని ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం
  • ఏపీ సృజనాత్మక, సాంస్కృతిక కమిషన్ చైర్ పర్సన్ తేజస్వీ పొడపాటిని చైర్ పర్సన్‌గా నియమించిన ప్రభుత్వం
  • ఉత్తర్వులు జారీ చేసిన పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పురాతన వస్తువుల విభజన కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర మ్యూజియంలో ఉన్న పురాతన వస్తువులను ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం - 2014 నిబంధనల ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య విభజించనున్నారు. ఈ మేరకు 8 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కమిటీ ఛైర్‌పర్సన్‌గా రాష్ట్ర సృజనాత్మక, సాంస్కృతిక కమిషన్ ఛైర్‌పర్సన్ తేజస్వీ పొడపాటిని నియమించారు. పురావస్తు, మ్యూజియంల శాఖ కమిషనర్ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. కమిటీలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన విశ్రాంత ప్రొఫెసర్ వకులాభరణం రామకృష్ణతో పాటు పురావస్తు, మ్యూజియంల శాఖలో సేవలందించిన రిటైర్డ్ స్థపతి డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ కేఎస్‌బీ కేశవ, రిటైర్డ్ ఏడీ బీ వాసుదేవాచారి, ఏపీ ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ ఎం యోగి రెడ్డి సభ్యులుగా నియమితులయ్యారు.

ఈ కమిటీ తెలంగాణ రాష్ట్ర కమిటీతో సమావేశమై రాష్ట్రానికి చెందిన పురాతన వస్తువుల గుర్తింపు, ఎంపిక, పర్యవేక్షణ, పంపిణీ చేపట్టనుంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పురాతన వస్తువులను రాష్ట్రానికి బదిలీ చేసి మ్యూజియాల్లో భద్రపరిచే చర్యలు తీసుకోనుంది. దీనికి సంబంధించిన తదుపరి చర్యలు చేపట్టాలని పురావస్తు, మ్యూజియంల కమిషనర్‌కు ఆదేశాలు ఇస్తూ పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. 

.
Tejaswi Podapati
AP Government
Telangana
Antiquities Division
Archaeological Survey
AP Reorganisation Act 2014
Museums
Andhra Pradesh
Ajay Jain
Cultural Commission

More Telugu News