H-1B వీసాదారులకు భారీ ఎదురుదెబ్బ.. లక్ష డాలర్ల ఫీజు పెంపును సమర్థించిన ఫెడరల్ కోర్టు

  • అప్పీల్ కోర్టును ఆశ్రయించిన యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్
  • ఒక్కో వీసాకు రూ. 84 లక్షల అదనపు భారం
  • టెక్ కంపెనీలకు దిక్కుతోచని స్థితి
  • ఒబామా నియమించిన జడ్జి మద్దతు కూడా ట్రంప్‌కే 
అమెరికాలో ఐటీ ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులకు, ముఖ్యంగా భారతీయులకు మరో షాక్ తగిలింది. H-1B వీసా దరఖాస్తులపై ఏకంగా 1,00,000 డాలర్ల (సుమారు రూ. 84 లక్షలు) ఫీజును విధిస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి న్యాయస్థానంలో ప్రాథమిక విజయం దక్కింది. ఈ ఫీజు పెంపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను డిస్ట్రిక్ట్ కోర్టు కొట్టివేయడంతో, ఇప్పుడు ఈ పోరాటం అప్పీల్ కోర్టుకు చేరింది.

ఏమిటీ వివాదం?
గత సెప్టెంబర్‌లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రత్యేక ప్రకటన ద్వారా H-1B వీసా ప్రోగ్రామ్‌లో భారీ మార్పులు చేశారు. విదేశీ నిపుణులను నియమించుకోవాలనుకునే కంపెనీలు ఒక్కో దరఖాస్తుకు అదనంగా లక్ష డాలర్లు చెల్లించాలని నిబంధన పెట్టారు. దీనివల్ల అమెరికా కంపెనీలు విదేశీయులకు బదులుగా స్వదేశీయులకే (అమెరికన్లకే) ఉద్యోగాలు ఇస్తాయని ట్రంప్ వాదన. అయితే, ఈ నిర్ణయం వల్ల టెక్నాలజీ, హెల్త్‌కేర్, విద్యారంగాలు కుప్పకూలుతాయని 'యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్' వాదిస్తోంది.

కోర్టులో ట్రంప్‌కే మొగ్గు!
ఆశ్చర్యకరంగా, మాజీ అధ్యక్షుడు ఒబామా హయాంలో నియమితులైన జడ్జి బెరిల్ హోవెల్ ఈ కేసులో ట్రంప్ నిర్ణయమే సరైనదని తీర్పునివ్వడం గమనార్హం. సెక్షన్ 212(f) ప్రకారం విదేశీయుల ప్రవేశాన్ని నియంత్రించే లేదా పరిమితం చేసే పూర్తి అధికారం అధ్యక్షుడికి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. "ఇది దేశ ఆర్థిక భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి, ఇందులో కోర్టులు జోక్యం చేసుకోలేవు" అని ఆమె పేర్కొన్నారు. దీనివల్ల ట్రంప్ ప్రభుత్వానికి పెద్ద ఊరట లభించినట్లయింది.

ముందున్న సవాళ్లు ఇవే..
  • అప్పీల్ కోర్టుకు కేసు: డిస్ట్రిక్ట్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ వారమే అప్పీల్ కోర్టులో పిటిషన్ వేసింది.
  • ఇతర రాష్ట్రాల పోరు: మసాచుసెట్స్, కాలిఫోర్నియా వంటి డెమొక్రాట్ పాలిత రాష్ట్రాలు కూడా ఈ ఫీజుకు వ్యతిరేకంగా వేర్వేరుగా కేసులు వేశాయి.
  • భారతీయులపై ప్రభావం: ఈ ఫీజు భారం వల్ల ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలతో పాటు చిన్న స్థాయి స్టార్టప్‌లు కూడా భారత్ నుంచి నిపుణులను అమెరికాకు తీసుకెళ్లడం దాదాపు అసాధ్యంగా మారనుంది.

ప్రస్తుతం అమెరికా కాన్సులేట్లలో వీసా ప్రాసెసింగ్‌లో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీనికి తోడు సోషల్ మీడియా స్క్రీనింగ్ వంటి కొత్త నిబంధనలు కూడా తోడయ్యాయి. ఈ న్యాయపోరాటం చివరకు అమెరికా సుప్రీంకోర్టుకు చేరే అవకాశం ఉందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. 


More Telugu News