యుద్ధం ముగియాలి.. కానీ ఆత్మగౌరవం వదులుకోం: జెలెన్‌స్కీ నూతన సంవత్సర శపథం!

  • తాము అలసిపోయాం కానీ లొంగిపోలేదన్న జెలెన్‌స్కీ
  • బలహీనమైన ఒప్పందాలపై సంతకం చేయబోనని స్పష్టీకణ
  • గెలుపు తమదేనంటూ పుతిన్ ధీమా
దాదాపు నాలుగేళ్లుగా కొనసాగుతున్న భీకర యుద్ధం మధ్య ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ నూతన సంవత్సర వేళ ప్రపంచానికి తన మనోగతాన్ని చాటారు. "యుద్ధం ముగియాలి.. శాంతి కావాలి.. కానీ అది ఉక్రెయిన్ అంతానికి దారితీసేదిగా ఉండకూడదు" అని స్పష్టం చేశారు. యుద్ధం వల్ల ఉక్రెయిన్ ప్రజలు తీవ్రంగా అలసిపోయిన మాట నిజమేనని అంగీకరిస్తూనే, ఆ అలసట లొంగుబాటుకు సంకేతం కాదని తేల్చి చెప్పారు.

ఒప్పందం ముంగిట ఉక్రెయిన్?
జెలెన్‌స్కీ తన 21 నిమిషాల ప్రసంగంలో ఒక కీలక విషయాన్ని వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫ్లోరిడాలో జరిపిన చర్చల తర్వాత శాంతి ఒప్పందం 90 శాతం సిద్ధమైందని ఆయన తెలిపారు. "మిగిలిన ఆ 10 శాతంలోనే అంతా ఉంది. అదే శాంతిని, ఉక్రెయిన్, యూరప్ భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది" అని ఆయన పేర్కొన్నారు. కేవలం కొన్ని వారాలు లేదా నెలల కోసం కాకుండా, దశాబ్దాల పాటు శాంతిని ఇచ్చే పటిష్టమైన ఒప్పందంపైనే తాను సంతకం చేస్తానని జెలెన్‌స్కీ భరోసా ఇచ్చారు.

భూభాగంపై వీడని పట్టు
ప్రస్తుతం ఉక్రెయిన్‌ భూభాగం సుమారు 19 శాతం రష్యా ఆధీనంలో ఉంది. తూర్పు డాన్‌బాస్ ప్రాంతం నుంచి ఉక్రెయిన్ దళాలను వెనక్కి తీసుకోవాలని రష్యా డిమాండ్ చేస్తోంది. అయితే, ఈ డిమాండ్‌ను 'మోసం'గా అభివర్ణించిన జెలెన్‌స్కీ ప్రస్తుతమున్న యుద్ధ రేఖలను అలాగే స్తంభింపజేయాలని కోరుతున్నారు.

మరోవైపు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన న్యూ ఇయర్ ప్రసంగంలో మాట్లాడుతూ "మనం విజయం సాధిస్తామని గట్టిగా నమ్ముతున్నాం. దేశం మొత్తం మీ వెంటే ఉంది" అని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ భూభాగంలో రష్యా ఆధిపత్యం కొనసాగుతుందని ఆయన పునరుద్ఘాటించారు. పుతిన్ తన ప్రసంగంలో తన నివాసంపై ఉక్రెయిన్ జరిపినట్లుగా చెబుతున్న డ్రోన్ దాడుల గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం.


More Telugu News