Delhi Pollution: ఊపిరి పోసుకుంటున్న ఢిల్లీ.. 2025లో మెరుగైన ఢిల్లీ గాలి.. గణనీయంగా తగ్గిన కాలుష్యం

Delhi Pollution Levels Hit 7 Year Low Clean Air Days Record
  • 2025లో మెరుగైన గాలి నాణ్యత
  • కొవిడ్ ఏడాది తర్వాత ఇదే అత్యుత్తమం 
  • ఏడాది పొడవునా 79 రోజులు ‘మంచి’ గాలి
  • గత ఏడేళ్లలో రెండో అత్యుత్తమ రికార్డు
  • సత్ఫలితాలనిస్తున్న కఠిన చర్యలు
దేశ రాజధాని ఢిల్లీ వాయు కాలుష్యం విషయంలో 2025లో గణనీయమైన పురోగతి సాధించింది. గత ఏడేళ్లలో ఎన్నడూ లేనంతగా అత్యుత్తమ గాలి నాణ్యతను నమోదు చేసింది. కొవిడ్ కారణంగా లాక్‌డౌన్‌లు అమలైన 2020 సంవత్సరాన్ని మినహాయిస్తే, 2025లోనే అత్యంత తక్కువ కాలుష్య స్థాయిలు నమోదైనట్టు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

2025లో మొత్తం 79 రోజులు గాలి నాణ్యత సూచీ (AQI) 'మంచి', 'సంతృప్తికర' కేటగిరీల్లో నమోదైంది. 2018 నుంచి చూస్తే, 2020 తర్వాత ఇదే అత్యధికం. ప్రభుత్వం తీసుకున్న నిరంతర చర్యల వల్లే ఈ సానుకూల మార్పు సాధ్యమైందని ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (CAQM) తెలిపింది. కాలుష్య కారకాలపై దృష్టి సారించి, క్షేత్రస్థాయిలో తీసుకున్న చర్యలు ఫలితాలనిచ్చాయని వివరించింది.

గణాంకాల ప్రకారం, 2025లో సగటు AQI 201గా నమోదైంది. ఇది 2024లో 209, 2018లో 225గా ఉండేది. ప్రమాదకరమైన పీఎం 2.5, పీఎం 10 కాలుష్య కణాల సగటు స్థాయిలు కూడా ఏడేళ్ల కనిష్ఠానికి పడిపోయాయి. అయితే, డిసెంబర్ నెలలో వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో కాలుష్యం పెరిగినప్పటికీ, వార్షిక సగటుపై అది పెద్దగా ప్రభావం చూపలేదు.

2025లో 'తీవ్రమైన' కాలుష్యపు రోజులు కేవలం 8 మాత్రమే నమోదు కావడం గమనార్హం. 2019లో ఇలాంటి రోజులు 25 ఉన్నాయి. చేపట్టిన విధానాలు సత్ఫలితాలనిస్తున్నాయని, రాబోయే సంవత్సరాల్లో ఢిల్లీ గాలి నాణ్యత మరింత మెరుగుపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
Delhi Pollution
Delhi AQI
Air Quality Index Delhi
Delhi Air Pollution Control
CAQM
National Capital Region Pollution
Stubble Burning
PM10
PM2.5
Clean Air Days Delhi

More Telugu News