జమ్మూకశ్మీర్‌లో ప్రాజెక్టుల వేగవంతం.. చీనాబ్ నదిపై మరో ప్రాజెక్టుకు భారత్ గ్రీన్ సిగ్నల్

  • చీనాబ్ నదిపై దుల్హస్తీ-II ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు
  • సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన తర్వాత కీలక పరిణామం
  • రూ.3,277 కోట్ల అంచనా వ్యయంతో 260 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
  • భారత్ నిర్ణయంపై ఐక్యరాజ్యసమితిని ఆశ్రయించిన పాకిస్థాన్
  • పశ్చిమ నదులపై పలు ప్రాజెక్టుల పనులను వేగవంతం చేస్తున్న కేంద్రం
సింధు జలాల ఒప్పందాన్ని ఏకపక్షంగా నిలిపివేసిన భారత్, పాకిస్థాన్‌తో జలవివాదంలో మరో కీలక ముందడుగు వేసింది. జమ్మూకశ్మీర్‌లోని కిష్త్‌వార్ జిల్లాలో చీనాబ్ నదిపై నిర్మించ తలపెట్టిన 260 మెగావాట్ల దుల్హస్తీ స్టేజ్-II జలవిద్యుత్ ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నిపుణుల కమిటీ (EAC) పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది. 

నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (NHPC) ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనుంది. దీని అంచనా వ్యయం సుమారు రూ.3,277 కోట్లు. ఇప్పటికే పనిచేస్తున్న 390 మెగావాట్ల దుల్హస్తీ స్టేజ్-I ప్లాంట్‌కు అనుబంధంగా దీన్ని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం 60.3 హెక్టార్ల భూమి అవసరం కాగా, ఇందులో 8.27 హెక్టార్ల ప్రైవేట్ భూమిని సేకరించాల్సి ఉంటుంది. తాజా అనుమతులతో నిర్మాణ టెండర్లను పిలిచేందుకు NHPCకి మార్గం సుగమమైంది.

2025 ఏప్రిల్‌లో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత, 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని (IWT) భారత్ నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పశ్చిమ నదులపై తనకున్న హక్కులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. "సింధు జలాల ఒప్పందం 2025 ఏప్రిల్ 23 నుంచి నిలిపివేయబడింది" అని EAC తన సమావేశపు మినిట్స్‌లో స్పష్టంగా పేర్కొనడం ఈ ప్రాజెక్టు వేగవంతం వెనుక ఉన్న వ్యూహాన్ని తెలియజేస్తోంది.

కేవలం దుల్హస్తీ-II మాత్రమే కాకుండా, చీనాబ్ నదిపై 1,856 మెగావాట్ల సావల్‌కోట్ ప్రాజెక్టుతో పాటు రాటిల్, బుర్సార్, పాకల్ దుల్ వంటి అనేక ఇతర ప్రాజెక్టుల పనులను కూడా భారత్ వేగవంతం చేస్తోంది. 

ఈ పరిణామాలపై పాకిస్థాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. భారత్ చర్యలు ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఆరోపిస్తూ, జోక్యం చేసుకోవాలని కోరుతూ ఐక్యరాజ్యసమితికి లేఖ రాసింది. అయితే, భారత్ ఒప్పందాన్ని పక్కనపెట్టినప్పటికీ, ఈ వివాదాన్ని విచారించే అధికారం తమకుందని అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టు (PCA) గతంలోనే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రాజెక్టులతో ముందుకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.


More Telugu News