KTR: సిరిసిల్లలో పర్యటించిన కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం

KTR Angry at Congress Government During Sircilla Visit
  • అపారెల్ పార్కును సందర్శించిన కేటీఆర్
  • కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలతో నేత కార్మికులకు అన్యాయం జరుగుతోందని ఆగ్రహం
  • 25 వేల మంది మహిళలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో పార్కును ఏర్పాటు చేసినట్లు వెల్లడి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్లలోని అపారెల్ పార్కును సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల నేత కార్మికులకు అన్యాయం జరుగుతోందని అన్నారు. అపారెల్ పార్కులో తమ హయాంలో వచ్చిన రెండు పరిశ్రమలు మినహా ఇప్పటి వరకు కొత్తగా ఒక్క పరిశ్రమ కూడా రాలేదని ఆయన పేర్కొన్నారు. 25 వేల మంది మహిళలకు ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతో ఈ పార్కును ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

సంక్రాంతి లోపు వర్కర్ టు ఓనర్ పథకం లబ్ధిదారులను ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో 10 వేల మందితో నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకున్నామని కేటీఆర్ అన్నారు. అపారెల్ పార్కును రూ.400 కోట్లతో ఏర్పాటు చేసింది తామేనని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు ఏమీ చేయలేదని ఆయన విమర్శించారు.

అంతకుముందు కేటీఆర్ సిరిసిల్ల పట్టణ ఎస్సీ బాలుర హాస్టల్ విద్యార్థులతో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేసి, అనంతరం విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశారు. అంతకుముందు జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన క్రికెట్ పోటీల విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు.
KTR
KT Rama Rao
Sircilla
Apparel Park
BRS
Congress Government
Weavers
Telangana

More Telugu News